సాహస క్రీడలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన తమిళనాడు

- January 20, 2019 , by Maagulf
సాహస క్రీడలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన తమిళనాడు

వద్దని నిషేధించిన సాహస క్రీడలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది తమిళనాడు. సంక్రాంతి సంబరాల్లో భాగమైన జల్లికట్టుతో ఈ రికార్డ్ ను సృష్టించారు. గిన్నిస్ ఫీట్ సాధించేందుకు 500 మంది జల్లికట్టు ఆటగాళ్లు రెండు వేల ఎద్దుల్ని అదుపు చేశారు. సాంప్రదాయ సాహస క్రీడలో తమకు సాటిలేదని చాటారు తమిళనాడు కుర్రాళ్లు.

పుదుకొట్టై జిల్లా విరాళిమలైలో జరిగిన ఈ పోటీలను తమిళనాడు సీఎం పళని స్వామి స్వయంగా ప్రారంభించారు. జల్లికట్టు నిర్వహణలో సుప్రీం కోర్టు సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు పాటించిన తమిళనాడు ప్రభుత్వం…క్రీడాకారులకు తొలిసారిగా భీమా సదుపాయం కూడా కల్పించింది. ఈ సాహస క్రీడాలో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వారికి రెండు లక్షల రూపాయలు చెల్లించేలా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ఇన్షూరెన్స్ చేయించింది.

రికార్డ్ జల్లికట్టు పట్టును చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలొచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు..కెనడా, సింగపూర్, మలేసియా నుంచి కూడా విరాళిమలై చేరుకున్నారు. గిన్నిస్ రికార్డ్ ఫీట్ ను చూసేందుకు ఆసక్తి కనబర్చారు. ఈ ఈవెంట్ కు రెండు వేల మంది భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గిన్నిస్ రికార్డ్ లో చోటు దక్కించుకోగానే హర్షం వ్యక్తం చేసిన సీఎం పళనిస్వామి జల్లికట్టులో తమిళియన్లు హీరోలని ప్రశంసించారు.

హింసకు తావిచ్చే జల్లికట్టుపై సుప్రీం కోర్టు 2014లో నిషేధం విధించింది. సంక్రాంతిలో భాగమైన సాంప్రదాయ క్రీడను నిషేధించటంపై తమిళనాడు నిరసనగళం వినిపించింది. మూడేళ్ల పాటు న్యాయపోరాటం చేసింది. కొన్ని షరతులతో జల్లికట్టు నిర్వహణకు కోర్టు అనుమతి ఇచ్చింది. అప్పట్నుంచి ప్రతి ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు సాహసక్రీడను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com