గడ్కరీ సమర్పించు బంగారు ఆంధ్రప్రదేశ్.!
- January 21, 2019
'ఆంధ్రప్రదేశ్‌కి అన్నీ చేసేశాం.. కావాలంటే, ఏ స్వతంత్ర సంస్థతో అయినా సర్వే చేయించుకోండి.. ఐదేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ పరిస్థితికీ, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితికీ చాలా తేడా కన్పిస్తుంది. మేం రాష్ట్రానికి ఎన్నో చేసినా మా పాత మిత్రుడు మమ్మల్ని ఆడిపోసుకుంటూనే వున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడీ అభివృద్ధి కన్పిస్తోందంటే అది కేవలం నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమయ్యింది..' అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోపక్క ఏపీ బీజేపీ నేత, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాత్రం రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని చెబుతున్నారు. చంద్రబాబు అబద్ధాలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా విష్ణుకుమార్‌రాజు, చంద్రబాబు భజన చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? పైగా, బీజేపీని వీడి, టీడీపీలో చేరేందుకు విష్ణుకుమార్‌రాజు ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.
ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ నితిన్ గడ్కరీ చెబుతున్న స్థాయిలో అభివృద్ధి చెందిందా.? అంటే, ఆయన చెప్పిందే నిజమైతే.. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు ఖాతాలోకే వెళుతుందన్నది తెలుగు తమ్ముళ్ళ వాదన. ఇటు చంద్రబాబు, అటు నరేంద్రమోడీ.. ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ పబ్లిసిటీ స్టంట్స్ కోసం ప్రయోగ శాలగా మార్చేసిన మాట వాస్తవం.
ప్రత్యేక హోదా విషయమై 2014 ఎన్నికలకు ముందు మోడీ, చంద్రబాబు చేసిన పొలిటికల్ స్టంట్స్‌ని ఎలా మర్చిపోగలం.? పోలవరం ప్రాజెక్ట్ విషయానికొస్తే.. కేంద్రం, రాష్ట్రం కలిసి నాలుగున్నరేళ్ళుగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వున్నాయి. విశాఖ రైల్వే జోన్ కావొచ్చు, కడప ఉక్కు పరిశ్రమ కావొచ్చు, రాజధాని అమరావతి కావొచ్చు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కావొచ్చు.. అన్ని విషయాల్లోనూ చంద్రబాబు - మోడీ కలిసే రాష్ట్ర ప్రజల్ని వంచించారన్నది ఓపెన్ సీక్రెట్.
గడ్కరీ విషయాన్నే తీసుకుంటే, రాష్ట్రంలో అనేక రహదారి ప్రాజెక్టులకు దాదాపు లక్ష కోట్లు కేటాయించామని గతంలోనే ఆయన చెప్పుకున్నారు. అమరావతి రింగ్ రోడ్డుకి సంబంధించి గడ్కరీ చేసిన పబ్లిసిటీ స్టంట్ అంతా ఇంతా కాదు. అమరావతి రింగూ లేదు.. ఆఖరికి విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవర్ ఓపెనింగూ లేదాయె.!
'గడచిన ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వర్ణయుగం' అంటూ గడ్కరీ ఇచ్చిన 'కవరింగ్' ఒక్కసారిగా అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఒక్కటంటే ఒక్క కొత్త జాతీయ విద్యా సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా సొంత భవనంలో కార్యకలాపాలు కొనసాగిస్తోందా.? మరెక్కడ 'గోల్డెన్ ఆంధ్రప్రదేశ్' నితిన్ గడ్కరీకి కన్పించిందట.?
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!