లక్ష మంది బాధితులు.. జాబ్స్ పేరుతో రూ.70 కోట్లు..
- January 26, 2019
హైదరాబాద్:తీగ లాగితే విజ్డమ్ జాబ్స్ డాట్ కామ్ డొంక కదిలింది. మాగల్ఫ్ ఎఫెక్ట్‌తో రంగంలోకి దిగిన పోలీసులు.. మోసగాళ్ల ఆట కట్టించారు. ఉద్యోగాల పేరుతో కోట్లు కొల్లగొట్టిన సంస్థ నిర్వాహకులను కటకటాల వెనక్కి నెట్టారు హైదరాబాద్ పోలీసులు.
లక్ష మంది బాధితులు. జాబ్స్ పేరుతో రూ.70 కోట్లకు పైగా వసూళ్లు. ఇదీ విజ్డమ్ జాబ్స్ డాట్ కామ్ దందా. హైదరాబాద్ మాదాపూర్‌లోని సైబర్ టవర్స్‌లో ఉన్న సంస్థ… ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించింది. లేని కంపెనీలను ఉన్నట్లు చూపించి నిరుద్యోగులను నిండా ముంచింది. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉన్న దాదాపు 3 కోట్లకుపైగా యూజర్లు రిజిష్టర్ చేయించుకున్న ఈ సంస్థ.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎంతోమంది నిరుద్యోగులను దోచుకున్నట్లు బయటపడింది. ఏడుకొండలు అనే బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. విజ్డమ్ డొంక కదిలింది. విజ్‌డం మోసాలపై మాగల్ఫ్ వివరాలు సేకరించింది. ఈ కేసులో ఇప్పటికే సీఈవో అజయ్ కొల్లాతోపాటు మరో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అజయ్ కొల్లా మన దేశంలోనే కాదు గల్ఫ్‌లోనూ ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు బయటపడింది. అక్కడి వార్తాపత్రికల్లో ఈ బాగోతంపై కథనాలు వచ్చాయి. విజ్డమ్ జాబ్స్ డాట్ కామ్ పేరుతో ఇండియాలో, విజ్డమ్ గల్ఫ్ జాబ్స్ డాట్ కామ్ పేరుతో విదేశాల్లో నిరుద్యోగులకు టోపీ పెట్టాడని తేలింది. ఉద్యోగాలు వస్తాయని నమ్మి డబ్బులు కడితే తమను నిండా ముంచారని బాధితులు వాపోతున్నారు. సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే కంపెనీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ వివరాలను కొందరు బాధితులు మాగల్ఫ్.కామ్ ఫౌండర్ శ్రీకాంత్ చిత్తర్వుతో పంచుకున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండానే విజ్‌డం సంస్థ 2010లో కార్యకలాపాలు మొదలు పెట్టింది. ఐటీ కంపెనీ పేరుతో దీన్ని రన్ చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. నలుగురు ఉద్యోగులతో మొదలైన ఈ సంస్థ ఇప్పుడు 400 మంది ఉద్యోగులు పనిచేసే స్థాయికి ఎదిగింది. రకరకాల ఫీజుల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.70 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వాళ్ల డేటాను అజయ్ కొల్లా.. ఇతర కంపెనీలకు అమ్ముకున్నట్టు కూడా తమ దృష్టికి వచ్చిందని సీపీ అన్నారు. అజయ్ కొల్లాతో పాటు ఈ మోసం వెనుక ఇంకెవరెవరున్నారు? ఎంత మందికి కుచ్చుటోపీ పెట్టారు? అన్నదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







