కంగనపై క్రిష్ ఫైర్..మణికర్ణిక దర్శకత్వ క్రెడిట్ తీసుకోవడంపై అసహనం..

- January 27, 2019 , by Maagulf
కంగనపై క్రిష్ ఫైర్..మణికర్ణిక దర్శకత్వ క్రెడిట్ తీసుకోవడంపై అసహనం..

కంగనా రానౌత్ ప్రధాన పాత్రలో నటించిన మణికర్ణిక మూవీ ఇటీవల విడుదలై హిట్ సాధించింది.. ఈ మూవీకి క్రిష్, కంగనా రానౌత్ లు దర్శకత్వం వహించారు. ఈ మూవీ 70 శాతం షూటింగ్ క్రిష్ ఆధ్వర్యంలో జరగగా, మిగిలిన భాగాన్ని కంగనా పూర్తి చేసింది.. అయితే టైటిల్ కార్డ్ లో కంగన పేరు ముందు వేసి ఆ తర్వాత క్రిష్ పేరు చేర్చారు.. దీనిపై క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ''కంగనా రనౌత్‌కు ఎలా నిద్ర పడుతుంతో నాకు అర్థం కావడం లేదు. ఆమెకు అర్హత లేకున్నా దర్శకత్వంలో ఫస్ట్‌ క్రెడిట్‌ తీసుకున్నారు. ముందు తన పేరు వేసుకున్నారు'' . ''జూన్‌ నెలకు సినిమా పూర్తి చేశా. కంగనా రనౌత్‌ మినహా మిగతా ఆర్టిస్టులు డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఆమె సినిమా చూసి కొన్ని మార్పులు చేయాలని అన్నారు. తర్వాత 'వాళ్ల పాత్ర పెద్దగా ఉంది. వీళ్ల పాత్ర పెద్దగా ఉంది. సినిమాలో అది మార్చాలి.

ఇది మార్చాలి' అనేవారు. కొన్ని రోజుల తర్వాత సహ నిర్మాత కమల్‌ జైన్‌ సినిమా పట్ల సంతోషంగా లేరన్నారు. నేను కొన్ని మార్పులు చేయడానికి అంగీకరించా. మరో ఆరు రోజులు చిత్రీకరణ చేయాలనుకున్నాం.

రచయిత ప్రసూన్‌ జోషితో మార్పుల విషయమై చర్చిస్తున్నా. అనూహ్యంగా ఓ రోజు సోనూ సూద్‌ పోషించిన సదాశివ్‌ రావ్‌ పాత్రను ఇంటర్వెల్‌ పాయింట్‌ దగ్గర చంపేయాలని కంగన కోరారు. అప్పుడు మా మధ్య వాగ్వాదం జరిగింది. సహ నిర్మాత కమల్‌ జైన్‌ నా వైపు కాకుండా కంగన వైపు నిలబడ్డారు.

ద్వితీయార్ధంలో సోనూ సూద్‌ పాత్ర అవసరం లేదని కంగన వాదించారు. చరిత్రకు పూర్తి విరుద్ధమది. చరిత్ర ప్రకారం లక్ష్మీబాయి కంటే కొంతముందు సదాశివ్‌ రావ్‌ మరణిస్తారు. నేను ఆ పాత్రలో మార్పుకు నేను అంగీకరించలేదు.

అలా అయితే 'కంగన మరొకరి సహాయంతో సినిమాకు దర్శకత్వం వహిస్తుంది' అన్నారు కమల్‌ జైన్‌. నాకు అర్థం కాలేదు. నేను దర్శకత్వం వహించకపోతే తాను చిత్రంలో నటించనని సోనూ సూద్‌ అన్నారు. వేరే నటుడితో అతని పాత్రను రీషూట్‌ చేశారు.

చాలామంది పాత్రల నిడివి తగ్గించారు'' .''ఓసారి జీ స్టూడియోస్‌ సంస్థకూ నేను తీసిన చిత్రం నచ్చలేదని కంగనా రనౌత్‌ నాతో చెప్పారు. భోజ్‌పురి చిత్రంలా ఉందన్నారు. నేను నవ్వాను. నేను తీసిన చిత్రాలు ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు తెలుసు.

అప్పుడు మా మధ్య వాగ్వాదం జరిగింది. అయితే.. తనకు నచ్చినట్టు సినిమా తీయాలనుకున్నారు కంగన'' . ''నేను 'మణికర్ణిక' చూశా.

ప్రథమార్ధంలో కంగనా రనౌత్‌ 20-25 శాతం చిత్రానికి దర్శకత్వం వహించారు. అందులో ఓ పాట, పులులు కంగనపై ఎటాక్‌ చేసే ఆమె పరిచయ సన్నివేశాన్ని నేను తీయలేదు. ద్వితీయార్ధంలో 10-15 శాతం చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. నేను వేరే విధంగా తీసిన కొన్ని సన్నివేశాలనూ మళ్లీ చిత్రీకరించారు'' అని దర్శకుడు క్రిష్‌ అన్నారు.

ఆమె ''కేవలం 30 శాతం చిత్రాన్ని, కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను క్రిష్‌, నిక్‌ పావెల్‌ తీశారు. వాటిలో చాలా ప్యాచ్‌ వర్క్‌ నేను చేశా. అలాగే, మిగతా 70 శాతం చిత్రానికి నేనే దర్శకత్వం వహించా'' అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com