యువతిని ఒమన్ తీసుకెళ్లిన ఏజెంట్: సుష్మా సాయంకోరిన తల్లి

- February 03, 2019 , by Maagulf
యువతిని ఒమన్ తీసుకెళ్లిన ఏజెంట్: సుష్మా సాయంకోరిన తల్లి

న్యూఢిల్లీ: ఒమన్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని, నెలకు రూ.25వేల వేతనం ఉంటుందని చెప్పి ఓ యువతిని అక్కడకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆమె గల్ఫ్ కంట్రీలోనే చిక్కుకుపోయింది. దీంతో, తమ కూతురును వెనక్కి రప్పించేలా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సహకరించాలని ఆమె మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. సహాయం చేయడం విషయంలో సుష్మ వెంటనే స్పందిస్తుంటారు. గతంలోను ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

తాజాగా, హైదరాబాద్‌లోని ఓ యువతిని ఏజెంట్ ఉద్యోగం పేరు చెప్పి ఒమన్ తీసుకెళ్లింది. ఇప్పుడు ఆమె అక్కడే చిక్కుకుపోయింది. దీంతో బాధితురాలి తల్లి కన్నీరుమున్నీరు అవుతోంది.

బాధితురాలి తల్లి రషీదా బేగం మీడియాతో మాట్లాడుతూ... ఏజెంట్ షహీదా తమ కూతురును కలిసి ఒమన్‌లో మంచి ఉద్యోగం ఉందని చెప్పిందని, అక్కడ రూ.25వేల వరకు వేతనం ఉంటుందని చెప్పిందని, ఏజెంట్‌ను నమ్మి తాము మోసపోయామని, గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన ఇక్కడి నుంచి ఒమన్ వెళ్లిందని, అక్కడ ఓ ఆఫీస్‌లో ఉద్యోగానికి పెట్టారని, కానీ ఆ తర్వాత ఈ ఏజెంట్ పదేపదే ఉద్యోగాలు మార్చిందని వాపోయారు.

తమ కూతురు ఉద్యోగం పదేపదే మార్చడంతో పాటు వేతనం కూడా ఇవ్వలేదని వాపోయింది. అసలు తమ కూతురుకు సరైన భోజనం కూడా పెట్టడం లేదని చెప్పారు. ఆ తర్వాత ఆ ఏజెంట్ తమ కూతురును ఓసారి గదిలో వేసి తాళం వేసిందన్నారు.

ఈ విషయం తమకు తెలిసి ఏజెంట్ షహీదాను.. ఏం జరుగుతోందని, తమ కూతురుకు వేతనం ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు సరిగా భోజనం పెట్టడం లేదని అడిగామని చెప్పారు. కానీ తన కూతురును తిరిగి వెనక్కి రప్పించేందుకు రూ.2 లక్షలు ఇవ్వాలని షహీదా డిమాండ్ చేసిందని వాపోయారు. ఒమన్‌లో తన కూతురు దారుణ పరిస్థితుల్లో ఉందని వాపోయారు. కాబట్టి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ జోక్యం చేసుకొని తమ కూతురును వెనక్కి రప్పించాలని రషీదా బేగం ఓ ఛానల్‌తో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com