అవి కనిపించాయి..వణికిపోతున్న జపాన్

- February 04, 2019 , by Maagulf
అవి కనిపించాయి..వణికిపోతున్న జపాన్

టోక్యో: పైన ఫొటోలో కనిపిస్తున్న చేపను చూశారా.. దీనిపేరు ఓర్‌ఫిష్. సముద్ర పాము అన్న పేరు కూడా దీనికి ఉంది. ఇప్పుడీ చేపలను చూసి జపాన్ వణికిపోతోంది. మరోసారి తమ దేశాన్ని భూకంపాలు, సునామీ ఎక్కడ ముంచెత్తుతుందో అన్న ఆందోళన వాళ్లలో కనిపిస్తున్నది. ఇంతకీ ఈ చేపకు, జపాన్ వాసుల భయానికి కారణమేంటనేగా మీ డౌట్. పాములాగా ఎన్నో అడుగుల పొడువు ఉండే ఈ చేపలు సముద్ర గర్భంలో 200 మీటర్ల నుంచి కిలోమీటర్ లోతున ఉంటాయి. ఇవి తీరానికి కొట్టుకు వచ్చినా లేక మత్స్యకారుల వలలకు చిక్కినా సముద్ర గర్భంలో భూకంపం వచ్చిందని జపనీయులు భావిస్తారు. తాజాగా జపాన్‌లోని తొయామా తీరంలో మరో రెండు ఓర్‌ఫిష్‌లు కనిపించాయి. దీంతో ఈ సీజన్‌లో కనిపించిన మొత్తం ఓర్‌ఫిష్‌ల సంఖ్య ఏడుకి చేరింది. గతంలో 10.5 అడుగుల పొడువున్న ఓర్‌ఫిష్ తొయామా తీరానికి కొట్టుకొని వచ్చింది. ఆ తర్వాత 13 అడుగుల పొడువున్న మరో ఓర్‌ఫిష్ మత్య్సకారుల వలకు చిక్కింది. దీనిని సముద్ర దేవుడి నుంచి వచ్చిన దూతగా జపాన్ ప్రజలు భావిస్తారు. రైగు నో సుకాయ్ అని కూడా పిలుస్తారు.

వెండి రంగులో మెరిసిపోయే చర్మం, ఎర్రటి మొప్పలు ఈ చేపలకు ఉంటాయి. ఇవి తీరానికి వచ్చాయంటే ఏ విపత్తు సంభవించబోతున్నదని అక్కడి ప్రజలు భయపడతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారం అయితే ఏదీ లేదు. కానీ వంద శాతం ప్రకృతి విపత్త సంభవించదు అని కూడా చెప్పలేమని ఔజు ఆక్వేరియానికి చెందిన కజుసా సైబా అనే వ్యక్తి చెప్పడం విశేషం.

2011లో ఈ చేప కనిపించిన తర్వాతే ఫుకుషిమా భూకంపం, ఆ వెంటనే సునామీ వచ్చాయి. ఆ విపత్తులో మొత్తం 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాదికి ముందు కనీసం పది వరకు ఓర్‌ఫిష్‌లు తీరానికి కొట్టుకొచ్చాయి. మళ్లీ ఇప్పుడు అవి కనిపిస్తుండటంతో జపాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com