'హైజాకర్'ను కాల్చి చంపిన సాయుధ బలగాలు

- February 25, 2019 , by Maagulf
'హైజాకర్'ను కాల్చి చంపిన సాయుధ బలగాలు

చిట్టగ్యాంగ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. బంగ్లాదేశ్ నుంచి దుబాయ్ పయనమైన విమానాన్ని హైజాక్ చేయటానికి ప్రయత్నించినట్లు అనుమానిస్తున్న ఒక ప్రయాణికుడిని బంగ్లాదేశ్ ప్రత్యేక సాయుధ బలగాలు కాల్చి చంపాయి.

ఆదివారం ఢాకా నుంచి దుబాయ్ బయల్దేరిన బీజీ 147 పాసింజర్ విమానాన్ని హైజాక్ చేయటానికి అందులోనే ప్రయాణిస్తున్న ఓ యువకుడు ప్రయత్నించటంతో విమానాన్ని బంగ్లాదేశ్‌లోని చిట్టగ్యాంగ్‌లో అత్యవసరంగా దింపేశారని స్థానిక మీడియా పేర్కొంది.

చిట్టగ్యాంగ్‌లో విమానాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు అనుమానితుడిని అరెస్ట్ చేయటానికి ప్రయత్నించాయని, అతడు ఎదురు తిరగటంతో కాల్పులు జరిపాయని సైనిక అధికారులు చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

కాల్పుల్లో గాయపడిన అతడు తర్వాత చనిపోయాడని మేజర్ జనరల్ మోతియుర్ రహ్మాన్ మీడియాతో పేర్కొన్నారు. బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానంలోని 148 మంది ప్రయాణికులనూ సురక్షితంగా దించేశారు. సుమారు పాతికేళ్ల వయసున్న ఈ యువకుడు విమానాన్ని ఎందుకు హైజాక్ చేయటానికి ప్రయత్నించాడన్నది తెలయరాలేదు. 

''అతడు బంగ్లాదేశఈ పౌరుడే. అతడి వద్ద ఒక పిస్టల్‌ ఉంది. ఇంకే వివరాలూ తెలియవు'' అని రహ్మాన్ తెలిపారు. అనుమానితుడు మానసికంగా అనారోగ్యంతో ఉండివుండొచ్చునని, చిట్టగ్యాంగ్‌లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి షేక్ హసీనాతో మాట్లాడతానని డిమాండ్ చేశాడని అంతకుముందు కొన్ని వార్తలు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com