పాక్ గగనతలంలోకి భారత యుద్ధవిమానాలు..ఇది యుద్దానికి సూచనేనా?

- February 26, 2019 , by Maagulf
పాక్ గగనతలంలోకి భారత యుద్ధవిమానాలు..ఇది యుద్దానికి సూచనేనా?

నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి ఉన్న ఒక పెద్ద ఉగ్రవాద శిబిరంపై సోమవారం అర్ధరాత్రి దాటాక 03:30 గంటలకు భారత వైమానిక దళం దాడిచేసిందని ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది.

మిరాజ్-2000 యుద్ధవిమానాలు ఈ దాడి చేశాయని, ఉగ్రవాద శిబిరాన్ని సమూలంగా ధ్వంసం చేశాయని ఐఏఎఫ్‌కు చెందిన విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ ట్విటర్‌లో చెప్పింది. ఈ ఆపరేషన్‌లో 12 యుద్ధవిమానాలు పాల్గొన్నాయని, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం వెయ్యి కేజీల బరువున్న బాంబులు వేసినట్లు ఏఎన్‌ఐ వివరించింది.

ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై కశ్మీరీ మిలిటెంట్ ఆత్మాహుతి దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడికి పాకిస్తాన్ కారణమని భారత్ ఆరోపించింది. భారత్ ఆరోపణలను పాకిస్తాన్ కొట్టిపారేసింది.

నియంత్రణ రేఖను భారత వైమానిక దళం అతిక్రమించిందని, దీనిపై పాకిస్తాన్ వైమానిక దళం వెంటనే ప్రతిస్పందించిందని, దీంతో భారత యుద్ధవిమానాలు వెనుదిరిగాయని పాకిస్తాన్ సైనిక బలగాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మంగళవారం ట్విటర్‌లో చెప్పారు.

భారత యుద్ధవిమానాలు ముజఫరాబాద్ సెక్టార్ నుంచి ఎల్‌వోసీని అతిక్రమించాయని ఆయన ఆరోపించారు. పాక్ వైమానిక దళం నుంచి తక్షణ, సమర్థ ప్రతిస్పందన రావడంతో భారత యుద్ధవిమానాలు పేలుడు పదార్థాన్ని హడావిడిగా విడుదల చేసి వెనుదిరిగాయని, పేలుడు పదార్థం బాలాకోట్ సమీపాన పడిందని పేర్కొన్నారు. బాలాకోట్ పాకిస్తాన్‌లోని ఖైబర్-పఖ్తుంక్వా రాష్ట్రంలో ఉంది.

ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ఆయన చెప్పారు. తన వ్యాఖ్యకు మద్దతుగా కొన్ని ఫొటోలను ట్విటర్‌లో పెట్టారు. భారత వైమానిక దళం చర్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ''ఐఏఎఫ్ పైలట్లకు నేను సెల్యూట్ చేస్తున్నా'' అని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com