నేడు జగన్-అమిత్ షా ల కీలక భేటీ

- August 26, 2019 , by Maagulf
నేడు జగన్-అమిత్ షా ల కీలక భేటీ

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఏర్పాటైన అంతర్ రాష్ట్ర మండలి ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ అంతర్ రాష్ట్ర మండలికి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ తో పాటు నితీష్ కుమార్ (బిహార్), నవీన్ పట్నాయక్ (ఒడిశా), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర్ ప్రదేశ్), కమల్ నాథ్ (మధ్యప్రదేశ్), రఘుబర్ దాస్ (జార్ఖండ్), భూపేష్ బఘేల్ (ఛత్తీస్ గఢ్), తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ లతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.

దేశంలో 10 జిల్లాలు మావోయిస్టుల ప్రభావానికి గురైనట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లల్లో మావోయిస్టలు విస్తృతంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, స్థానికులను వాటిల్లో భాగస్వామ్యులను చేయడం వంటి చర్యల వల్ల వారిని నియంత్రించ వచ్చనేది కేంద్రం వ్యూహం. అందుకే- దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇదివరకే శ్రీకారం చుట్టింది.

ఆయా ప్రాంతాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై అధ్యయనం చేయడంతో పాటు, మావోయిస్టుల సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల నుంచి తగిన సూచనలు, సలహాలను తీసుకోవడానికే అమిత్ షా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పడిన తొలి సమావేశం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ భేటీకి హాజరు కావడం సైతం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com