బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్
- October 01, 2019
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్
హైదరాబాద్:తంగేడు, గునుగు కలయికతో.. బంతి చేమంతుల మమేకంతో తయారైన బతుకమ్మలు తెలంగాణలోని పల్లె సొబగును పరిమళింపజేశాయి. తీరొక్క పూలతో తయారైన బతుకమ్మలు చేతపట్టుకొని.. తీరొక్క చీరెలతో సింగారించుకొన్న మహిళలు.. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు ప్రారంభించారు. వాడవాడనా బతుకమ్మ పాటలు మార్మోగిపోయాయి. కులమతాలకు అతీతంగా రాష్ట్రమంతటా మహిళలు ఈ సంబురాల్లో భాగస్వాములయ్యారు. వాయనాలిచ్చిపుచ్చుకొన్నారు. వరంగల్‌లోని చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ రాష్ట్రంలో దాదాపు 300 చోట్ల, విదేశాల్లో 12 చోట్లతోపాటు పలురాష్ర్టాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించింది.
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు మొదలయిన నేపథ్యంలో...రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో పాటలు పాడి మహిళలతో కలిసి గవర్నర్ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 5వ తేదీ వరకు రాజ్‌భవన్‌లో ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ వెల్లడించారు.
కాగా, వంద దేశాల్లో బతుకమ్మ సంబురాలు జరుపుకొంటున్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వరంగల్‌లోని చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో బతుకమ్మ వేడుకలను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీశిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్-రేవతి, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణి, ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తదితరులు ప్రారంభించారు. బతుకమ్మ పాటల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రులు బతుకమ్మ ఆడిపాడారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..