నవంబర్ 3 న భారతరత్న, నోబెల్ విజేత అమర్త్యసేన్ జయంతి

- November 02, 2019 , by Maagulf
నవంబర్ 3 న భారతరత్న, నోబెల్ విజేత అమర్త్యసేన్ జయంతి

అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న వారిలో భారతదేశంలోనే కాదు పూర్తి ఆసియా ఖండం లోనే ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ అమర్త్య కుమార్ సేన్, అంతేకాదు భారతదేశమే కాక మొత్తం ప్రపంచ దేశాలు, ఆర్దిక శాస్త్రం మీద నూతన దృష్టిని సాధించడానికి కారణం అయిన వ్యక్తి అమర్త్య కుమార్ సేన్. ఇప్పటివరకు నోబెల్ బహుమతిని స్వీకరించిన వారెవ్వరూ కూడా సంక్షేమ అర్ధశాస్త్రం అనే శాఖ మీద సేన్ వలె దృష్టి సారించిన వారే లేరు. ఈ విధంగా ఆయన అర్ధ శాస్త్రజ్ఞుల దృష్టిని పూర్తిగా తాను స్పృశించి బలమైన పునాదులు వేసిన సంక్షేమ అర్ధశాస్త్రం మీద పడేటట్లు చేసిన వ్యక్తి వీరు. వీరు 1933 నవంబర్ 3న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతనంలో జన్మించారు. వీరికి అమర్త్యసేన్ అనే పేరు రవీంద్ర నాథ్ ఠాగూర్ పెట్టారు. వీరి తల్లిదండ్రులు అమితా సేన్, అశుతోష్ సేన్. వీరి ప్రాథమిక విద్య శాంతి నికేతన్ లోనే ప్రారంభమైంది.  వీరు 1953లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి ఎ పట్టభద్రుడైనారు. తరువాత ఆయన ఇంగ్లాండ్ కి వెళ్లి క్రేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లోని ట్రినిటీ కాలేజ్ లో ఎం ఏ., పి.హెచ్.డి చేశారు. భారత్ కి తిరిగివచ్చిన తరువాత కొంతకాలం జాదవాపూర్ విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్ర అధ్యాపకులుగా పనిచేసారు.  1957 నుండి 1963 వరకు క్రేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఫెలో సభ్యులుగా ఉన్నారు. 1963 లో ఆయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఏకనమిక్స్ లో పనిచేసారు. 1971 వరకు ఆ సంస్థలో పనిచేసారు. 1960లో ఆయనకు నవనీత దేవితో వివాహం జరిగింది. ఆమె బెంగాల్ భాషలోని సుప్రసిద్ధ రచయిత్రులలో ఒకరు. వీరికి 1977లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో విద్యార్దిగా ఉన్న ఇవా అనే విదేశీ వనితతో ఆయన రెండవ వివాహం జరిగింది. ఆమె 1985లో మరణించింది. 1991లో ఈమారోధ్స్ చైల్డ్ ను వివాహమాడారు. ప్రొఫెసర్ సేన్ ను పెద్దలు బబ్లూ అనే వారు. పరిచయస్తులు, మిత్రులు అమరత్ అని పిలిచేవారు.సేన్ అర్ధశాస్త్ర విషయాల మీద దాదాపు 24 పుస్తకాలు, 215 వరకూ పరిశోధనా వ్యాసాలు రాసారు. ఈ పుస్తకాల ఆధారంగానే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చిందని చెప్పవచ్చు. అమర్త్యసేన్ ప్రపంచ ఆర్దిక శాస్త్రంలో దారిద్య్రం కరువులకు అన్వయించేటట్లుగా నైతిక, తాత్విక అసమానతలు లను వివరించారు. ఆయన రచనలలోని ముఖ్య సారాంశం దేశం అన్ని రంగాలలో ఆర్థికాభివృద్ధి ని సాధించినా, అది సమాజంలోని బడుగు జీవికి చేరడం లేదనే. ట్రినిటీ కాలేజ్ లో ఉన్నప్పుడు ఆయన ప్రతిష్టాత్మకమైన ఆడం స్మిత్ పతకం, రీన్ బెర్రీ స్కాలర్ షిప్, స్టీవెన్ సన్ అవార్డును అందుకున్నారు.  ఆయన బహుముఖ ప్రజ్ఞకు 1999లో ఆర్దిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అదే సంవత్సరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ వరించింది. ఈయన నోబెల్ బహుమతి పొందిన 6 వ భారతీయుడు. ఇన్ని విశిష్టత లతో భారతరత్న పొందిన ఈయన నిజంగా రత్నమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com