అయోధ్య తీర్పు: నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

- November 07, 2019 , by Maagulf
అయోధ్య తీర్పు: నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

అయోధ్య (ఉత్తరప్రదేశ్): అయోధ్య రామాలయం, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అయోధ్య నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయోధ్యలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వీలుగా పారామిలటరీ బలగాలు, సాయుధ పోలీసులను మోహరించారు. అయోధ్య నగరానికి చెందిన కొందరు నిత్యావసర వస్తువులను తీసుకొని పిల్లలు, మహిళలను తీసుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అయోధ్య రామాలయంపై తీర్పు నేపథ్యంలో జరగనున్న పలు వివాహాలను రద్దు చేసుకున్నారు. తీర్పు నేపథ్యంలో దేవాలయంతో పాటు హిందువులు నివాసముంటున్న ప్రాంతాలకు చేరువగా ఉన్న సయ్యద్ వాడ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు రామాలయం నిర్మాణానికి అనుకూలంగా రాకపోతే తమపై దాడులు జరిగే ప్రమాదముందని సయ్యద్ వాడ బస్తీ వాసి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. తీర్పు నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా బియ్యం, నిత్యావసర వస్తువులను నిల్వ చేశామని హనుమాన్ దేవాలయం ముందు నివాసముంటున్న ఘన్ శ్యాం గుప్తా చెప్పారు. అయోధ్య నివాసులతో ఎలాంటి సమస్య లేదని, బయట నుంచి అయోధ్యకు వచ్చేవారి నుంచి సమస్య ఎదురవుతుందని దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com