గల్ఫ్ బాధితుల కుటుంబాలకు చెక్కులు పంపిణి చేసిన ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్

- December 16, 2019 , by Maagulf
గల్ఫ్ బాధితుల కుటుంబాలకు చెక్కులు పంపిణి చేసిన ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్

అమరావతి:ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందిన ప్రవాసాంధ్రుల కుటుంబాలను  ఆర్ధికంగా ఆదుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్యక్షులు చల్లా మధుసూదన్ రెడ్డి, ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్ మేడపాటి , వై.సి.పి గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్., చేతుల మీదుగా ఇవాళ ఏపీఎన్ఆర్టీ సొసైటీ కార్యాలయం లో సంబంధిత 7 కుటుంబాలకు అందజేశారు.

ఈ సందర్భంగా చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటి చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు.
 
ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో వై.యస్.ఆర్. జిల్లా మరియు ఉభయ గోదావరి జిల్లాల నుండి ప్రవాసాంధ్రులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు.గల్ఫ్ లో ఉంటున్న ప్రవాసాంధ్రులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి  సమస్యల పరిష్కారం కోసం ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ పని చేస్తున్న తీరు అందరి మన్ననలు పొందుతోందని ఇలియాస్ బి.హెచ్ అన్నారు.
   
అనంతరం ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల క్షేమమే ధ్యేయంగా వారికి సేవలందించడంలో రాష్ట్ర  ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ పనిచేస్తోందని  తెలిపారు.

విదేశాల్లో ప్రమాదవశాత్తు మృతిచెందిన ప్రవాసాంధ్రుల కుటుంబాలను  ఆర్ధికంగా ఆదుకోవాలనే  సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 70 కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను అందించామని ఇవాళ మరో  7 కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు. ప్రవాసాంధ్రులకు  ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ ఎన్నో సేవలను అందిస్తోందని.. ముఖ్యంగా మలేషియా ఆమ్నెస్టీ ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు 67 మంది బాధితులను వారి స్వస్థలాలకు తీసుకురావడం, ఇంకో 50 మందిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయడం, విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రులకు మరియు  ఎవరైతే కదలలేని స్థితిలో నిస్సహాయంగా ఉన్నారో అలాంటి వారికి సహాయంగా ఒక సహాయకుడిని ఇచ్చి ఉచిత అంబులెన్స్ సేవ అందించడం, ప్రవాసాంధ్రుల కుటుంబ ఆర్ధిక భద్రతలో భాగంగా ప్రవాసాంధ్ర భరోసా బీమా అందించడం చేస్తోందన్నారు.
ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ కార్యాలయం లో జరిగిన ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్  సీఈఓ భవాని శంకర్ మరియు ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్  సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com