'మూడు రాజధానులు' పై నిపుణుల కమిటీ అభిప్రాయమేంటో చదవండి

- December 20, 2019 , by Maagulf
'మూడు రాజధానులు' పై నిపుణుల కమిటీ అభిప్రాయమేంటో చదవండి

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలపై సత్వర సమీక్ష జరిపి, రాజధాని సహా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సమగ్ర వ్యూహాన్ని సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి నివేదికను అందజేసింది.

నివేదిక ముఖ్యాంశాలను కమిటీ కన్వీనర్, సభ్యులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ సమతౌల్యం తీసుకురావాలని సూచించామని చెప్పారు.

విశాఖపట్నం ప్రాంతంలో సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉండాలని సూచించినట్లు కమిటీ తెలిపింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, అమరావతి, విశాఖపట్నంలలో హైకోర్టు ధర్మాసనాలు పెట్టాలని సూచించినట్లు చెప్పింది.
సెప్టెంబరు 13న ఏర్పాటైన ఈ కమిటీకి మాజీ ఐఏఎస్ అధికారి (1988 బ్యాచ్) జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.

నివేదికపై ఈ నెల 27న శుక్రవారం జరిగే మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

దక్షిణాఫ్రికా దేశం తరహాలో రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన అవసరముందంటూ సీఎం ఈ నెల 17న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదికపై ఆసక్తి పెరిగింది.

"దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులుంటాయి. ఆ నమూనాలో బహుశా అమరావతిలో శాసన కార్యకలాపాల రాజధాని పెట్టొచ్చు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని పెట్టొచ్చు. యంత్రాంగమంతా అక్కడి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చెయ్యవచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ విధంగా న్యాయ రాజధాని ఓవైపు, కార్యనిర్వాహక రాజధాని మరోవైపు, శాసన రాజధాని ఇక్కడ (అమరావతిలో) ఉండొచ్చు" అని సీఎం మంగళవారం వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని తరలింపు వద్దని, ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను ఆదేశించాలని కోరుతూ రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కేసు విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం, సీఆర్‌డీఏ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. జీఎన్‌ రావు కమిటీ చట్టబద్ధత, హైకోర్టు తరలింపుపై గతంలో పిటిషన్‌ దాఖలైంది.

విపక్ష టీడీపీ, బీజేపీ నాయకులు రైతులకు మద్దతుగా వారి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని జనసేన ప్రకటించింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com