వ్యాపారులు, వేతన జీవులకు శుభవార్త--నిర్మలా సీతారామన్

- March 24, 2020 , by Maagulf
వ్యాపారులు, వేతన జీవులకు శుభవార్త--నిర్మలా సీతారామన్

ఢిల్లీ:భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ప్యాకేజీపై వర్కవుట్ చేస్తున్నామని తెలిపారు. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కు జూన్ 30 వరకు గడువు పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టామని అన్నారు. పన్ను చెల్లింపులపై అనేక వెసులుబాట్లను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వ్యాపారులు, వేతన జీవులకు ఎంతో ఊరటనిస్తుందని చెప్పవచ్చు.

ట్యాక్స్ రిటర్న్ గడువును పెంచుతున్నప్పటికీ ఈ నిర్ణయం కేవలం 2018 - 2019 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆధార్ - పాన్ లింకింగ్ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నిర్మలా సీతారామన్ దేశంలో కరోనా కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. రిటర్న్స్ ఆలస్యం అయితే 9 శాతం ఫైన్ విధించనున్నట్లు ప్రకటన చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికే లాక్ డౌన్ ను ప్రకటించారని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు కొలిక్కి వచ్చిందని... ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉందని చెప్పారు.

టీడీఎస్ జమలో ఆలస్య రుసుమును 18 నుంచి 9 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటన చేశారు. జూన్ 30 వరకు వివాద్ సే విశ్వాస్ గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. పన్ను వివాదాల మొత్తం చెల్లింపులో 10 శాతం అదనపు రుసుము ఉండదని చెప్పారు. జూన్ 30వ తేదీ వరకు మార్చి, ఏప్రిల్, మే జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు పెంచుతున్నామని స్పష్టం చేశారు. కరోనా కారణంగా జరిగిన నష్టాలపై దేశానికి సహాయపడటం కోసం కేంద్రం ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com