LIC ప్రీమియం చెల్లింపుదారులకు శుభవార్త

- April 12, 2020 , by Maagulf
LIC ప్రీమియం చెల్లింపుదారులకు శుభవార్త

కరోనా కారణంగా వాయిదాల చెల్లింపు గడువును నెల రోజులు పొడిగిస్తున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) శనివారం ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా పాలసీదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో మార్చి, ఏప్రిల్ గడువుల చెల్లింపులకు ఇది వర్తిస్తుందని ఎల్ఐసీ తన ప్రకటనలో తెలిపింది. గ్రేస్ పీరియడ్‌ మార్చి 22వ తేదీతో ముగిసినా ఏప్రిల్ 15వ తేదీ వరకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

ఇలా చెల్లింపులు జరపొచ్చు

పొడిగించిన గడువు మేరకు సర్వీస్ చార్జీలు లేకుండానే ఆన్‌లైన్ ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చునని ఎల్ఐసీ పేర్కొంది. మొబైల్ యాప్ ఎల్ఐసీ పేడైరెక్ట్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, భీమ్ యాప్, UPIల ద్వారా చెల్లించవచ్చునని పేర్కొంది. ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంకుల వద్ద, కామన్ సర్వీస్ సెంటర్స్ (CSs) ద్వారా ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చని తెలిపింది.

కరోనా మరణాలకు పరిహారం..

కరోనా వహమ్మారి కారణంగా మరణించిన పాలసీదారుల సంబంధీకులకు డబ్బులు చెల్లించినట్లు తెలిపింది. కరోనాకు సంబంధించిన మరణాలకు కూడా ప్రస్తుత, కొత్త పాలసీల కింద పరిహారం లభిస్తుందని తెలిపింది. ఈ తరహా క్లెయిమ్స్‌కు తక్షణ ప్రాతిపదికన పరిహారం చెల్లింపులు చేస్తున్నామని పేర్కొంది. ఇలా 16 క్లెయిమ్స్ ప్రాసెస్ చేశామని వెల్లడించింది.

ఆన్‌లైన్ ద్వారా ఎల్ఐసీ కొనుగోలుకు 5 పథకాలు

లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు 5 భీమా పథకాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్ఐసీ తెలిపింది. ఎల్ఐసీ టెక్ టర్మ్, జీవన్ సాథీ యాన్యుటీ ప్లాన్, కేన్సర్ కవర్, ఎస్ఐఐపీ, నివేశ్ ప్లస్ తీసుకు వచ్చినట్లు వెల్లడించింది.

అదే దారిలో ఇండియా పోస్ట్

మార్చి, ఏప్రిల్, మే నెలలకు చెల్లించాల్సిన భీమా ప్రీమియంను జూన్ 30వ తేదీ వరకు వాయిదా వేసినట్లు ఇండియా పోస్ట్ తెలిపింది. పెనాల్టీ లేకుండానే చెల్లించవచ్చని పేర్కొంది. వీటిలో పోస్టల్ లైఫ్ న్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఉన్నాయి. రిజిస్టర్డ్ పోర్టల్ ద్వారా కస్టమర్లు ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com