జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి

- April 22, 2020 , by Maagulf
జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడిపెట్టనుంది. జియో ప్లాట్‌పామ్స్‌లో 9.99శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. దీని విలువ రూ.43,574 కోట్లు. ఈ మేరకు ఇరు సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. తాజా వాటా కొనుగోలుతో జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఫేస్‌బుక్‌ నిలవనుంది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్ఐఎల్‌)లో భాగమైన రిలయన్స్‌ జియో భారత్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న టెలికాం నెట్‌వర్క్‌. 2016లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ఇప్పటి వరకు 38.8 కోట్ల వినియోగదారుల్ని చేర్చుకోగలిగింది. ‘‘భారత్‌లోని చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వాలన్నదే మా లక్ష్యం. ముఖ్యంగా దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఆరు కోట్ల చిన్న తరహా వ్యాపారాలకు అండగా నిలవాలనుకుంటున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారిని ఏకం చేయాలనుకుంటున్నాం. కరోనా సంక్షోభం తర్వాత.. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, దానికి జియో, ఫేస్‌బుక్ బంధం బాటలు వేస్తుందని భావిస్తున్నాం’’ అని రిలయన్స్‌ ఈ సందర్భంగా పేర్కొంది.
భారత్‌లో డిజిటల్‌ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని దీనిలో భాగం కావాలన్న లక్ష్యంతోనే జియోతో జతకడుతున్నామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఈ బంధం భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా దూసుకెళ్లేందుకు.. ప్రజలకు మెరుగైన వసతుల్ని అందించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు మరింత సమర్థంగా పనిచేసేలా మార్గాలు రూపొందించనున్నామని తెలిపింది. ఇప్పటికే ఫేస్‌బుక్‌ అధీనంలో ఉన్న వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో భారతీయ సమాజమే అతిపెద్దదని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ గుర్తుచేశారు. అలాగే ప్రతిభగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారత్‌ నిలయంగా ఉందని పేర్కొన్నారు. డిజిటల్‌ వ్యవస్థ దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో జియో కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com