కరోనా:గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రధానికి నివేదన

- April 22, 2020 , by Maagulf
కరోనా:గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రధానికి నివేదన

కరోనా మహమ్మారి నేపథ్యంలో గల్ఫ్ వలసకార్మికుల సమస్యలపై భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తున్న 35 పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, విద్యావంతులు కలిసి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. ఎస్. జై శంకర్ కి, సహాయ మంత్రి వి.మురళీధర్ కి గల్ఫ్ కార్మికుల డిమాండ్లతో కూడిన వినతిపత్రం  పంపించడం జరిగింది. ఈ ప్రకటన రూపకల్పనలో దేశవ్యాప్తంగా 35 మంది పాలుపంచుకోగా,ఇందులో తెలంగాణాకు చెందిన ఐదుగురు ప్రవాసి కార్మికనాయకులు పి.నారాయణ స్వామి, మంద భీంరెడ్డి, డా.లిసీ జోసెఫ్, కె. నర్సింహ నాయుడు, గుగ్గిళ్ల రవిగౌడ్ లు ఉన్నారు. 

కోవిడ్-19 మహమ్మారి ఇక ఎంతమాత్రం ఆరోగ్య సంక్షోభం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్మికుల యజమానుల ఆరోగ్యం, జీవనోపాధి, ఆదాయానికి ముప్పు తెచ్చింది. ప్రపంచంలో  అత్యధిక వలసకార్మికులను పంపే దేశంగా ఉన్న భారతదేశం ఆందోళన చెందడానికి చాలా కారణాలు ఉన్నాయి. 

లాక్ డౌన్ ట్రావెల్ బ్యాన్ ఎత్తేసిన తర్వాత భారత్ లోకి వలసదారుల తిరుగు ప్రవాహం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నమైన సవాళ్లు ఎదుర్కోవలసి ఉన్నందున తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.  ఈ సంక్షోభ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు, గర్భవతులు,  తీవ్రమైన జీవనశైలి వ్యాధులు కలవారు, వృద్ధులు, స్వల్పకాలిక వీసాలపై ఉన్నవారు, వివిధ అనారోగ్యాలతో  బాధపడుతున్న వలస కార్మికులను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం సదుపాయం కల్పించాలని కోరారు. కార్మికులను ఎక్కువగా విదేశాలకు పంపే రాష్ట్రాల సమన్వయంతో  కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పునరావాస, పునరేకీకరణ వ్యూహాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. 

⮚ కార్మికులను స్వదేశానికి రప్పించడంలో ఇబ్బంది ఉన్నప్పటికీ, ఈ అత్యవసర పరిస్థితిలో  వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి ఉచితంగా వాపస్ తీసుకురావాలి లేదా ట్రావెల్ సబ్సిడీ (ప్రయాణ రాయితీ) అయినా ఇవ్వాలి. 

⮚ వాపస్ వచ్చిన వారికి వైద్య పరీక్షలు, 'క్వారంటైన్' (నిర్బంధ) సౌకర్యాలు కల్పించడానికి, కార్మికులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి తక్షణ ఆర్థిక సహాయం కొరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం ప్రకటించాలి.  

⮚ వివక్ష, వెలి, కళంకము ల నివారణ - ప్రస్తుత పరిస్థితులలో వివక్షకు వ్యతిరేకంగా కఠినచర్యలు, చట్టపరమైన రక్షణల కోసం భారత ప్రభుత్వం విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరుపవచ్చు. ఈ విషయంలో స్వదేశంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలి. 

⮚ భారతీయ రాయబార కార్యాలయాల వారు తక్షణం అన్ని కార్మిక శిబిరాలు (లేబర్ క్యాంపులు)  సందర్శించాలి. సంక్షోభంలో ఉన్న కార్మికుల డేటాను సేకరించి వారికి ఉచిత కొవిడ్-19 పరీక్షలు, ఆహారం, ఆశ్రయం, మనుగడ భత్యం తదితర సహాయం అందించాలి. 
 
⮚ కువైట్ కు 'రాపిడ్ రెస్పాన్స్ టీం' (అత్యవసర సహాయ బృందం) పేరుతో వైద్య బృందాన్ని  పంపిన మాదిరిగానే, భారతీయుల జనాభా ఎక్కువగాఉన్న దేశాలకు పంపేందుకు భారత ప్రభుత్వం ముందుకు రావాలి.   

⮚ వలసదారుల వీసా స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం ఆతిథ్య దేశాలతో చర్చలు జరపాలి.   

⮚ భారతీయ కార్మికులకు ఉచిత కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను అందించండి.

➢ వాపస్ వచ్చిన వారికి  రిజిస్ట్రేషన్ సమయంలో ఏకమొత్త భత్యంగా ఆర్థిక సహాయం అందించండి. ఈ కార్మికులు బ్యాంకు రుణాలు,  ప్రైవేటు రుణాలు తిరిగి చెల్లించడంపై మూడు నెలల 'మారటోరియం' (తాత్కాలిక నిషేధాన్ని) ప్రకటించండి.

➢ తిరిగి వచ్చిన వలసదారుల నైపుణ్యం, అనుభవం ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేకంగా డేటా (సమాచారం) ను సేకరించాలి.  స్థానిక జాబ్ మార్కెట్ (ఉద్యోగ విపణి) లో వీరికి కొంత కోటా కేటాయించాలి. ప్రస్తుతం ఉన్న వన్‌టైమ్ (ఒకేసారి) సహాయ పథకాలకు బదులుగా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో  పునరావాసం, పునరేకీకరణ కోసం స్థిరమైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.   

⮚ కోవిడ్-19 వంటి మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోవడం, ఆరోగ్య ముప్పులను ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) భీమా పథకంలో చేర్చాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com