కార్మిక దీపంపై కరోనా శాపం : కార్మికుడా! నీకు ఎలా చెప్పాలి మే డే శుభాకాంక్షలు..

- May 01, 2020 , by Maagulf
కార్మిక దీపంపై కరోనా శాపం : కార్మికుడా! నీకు ఎలా చెప్పాలి మే డే శుభాకాంక్షలు..

ఈ ప్రపంచ పయనానికి శ్రామికుడి స్వేదం ఓ ఇంధనం. కొడవలి-నాగలి, పలుగు-పారా, కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం ఏదైతేనేం అంతిమంగా పేదోడికి పట్టెడన్నం పెట్టేది అతని శ్రమే. ఏ దేశ ఆర్దిక వ్యవస్థకైనా తఈ అట్టడుగు వర్గమే ఆయువు పట్టు. అందుకే చెమటదీపం ఆరిపోతే చరిత్రంతా చీకటే అంటారు. శ్రామికుడు, కార్మికుడు లేని ప్రపంచం అంధకారమే. ఆ కార్మికుడి కష్టాన్ని దోచుకుంటున్న పెత్తందార్లపై పిడికిలి బిగించిన అద్భుత ఘట్టానికి పునాది పడింది మే ఒకటిన. అందుకే ఈ మేడే శ్రామికుల డే. శ్రమజీవులకు హాలీడే.

మే డేను ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల పెత్తందార్ల దోపిడికి నిరసనగా జరుపుకుంటే..ఇంకొన్ని చోట్ల శ్రమకు తగిన గుర్తింపు దక్కిన రోజుగా జరుపుకుంటారు. భారత్ లో 1923నుంచి మే డేని పాటిస్తూ వస్తున్నారు. కానీ, అంతకుముందు మూడు దశాబ్దాల పూర్వం షికాగోలో జరిగిన హింసాకాండతో మే డేకి పునాది వేసింది. 1886 మే 1న షికాగోలో కార్మికుల శ్రమదోపిడిపై కార్మికులు పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటానికి మద్దతుగా షికాగో మార్కెట్ లో
కార్మికులు పెద్ద ఎత్తున చేపట్టిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత ఈ పోరాటం కాస్తా ప్రపంచవ్యాప్తమైంది. శ్రమ దోపిడిపై శ్రామిక వర్గం ఉక్కుపిడికిలి బిగించి ఉద్యమించింది. రోజుకు ఎనిమిది గంటలే పని..అనే నినాదంతో పెట్టుబడిదారులపై విజయం సాధించింది. అప్పటి ఉద్యమ ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న 8 గంటల పని విధానం. మే 1న పోరాటానికి నాంది పడింది కనుక ఆ నాటి నుంచి నేటి వరకు మే ఒకటిని అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ప్రతి ఏటా మే డేని ఓ సంబురంలా నిర్వహించుకోవటం పరిపాటి. కానీ, ఈ సారి మే డే కార్మికుల కన్నీళ్లు తుడవలేని నిస్సాహయ స్థితిలో ఉంది. కరోనా సంక్షోభం కార్మికుడి కుటుంబాల్లో తీరని కల్లోలం నింపింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పొట్టగొట్టింది. కరోనా దెబ్బతో చేసేందుకు పని లేక ఆకలి బాధతో అలమటించే దీన పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధి కోసం ఎడారి దేశం వచ్చిన గల్ఫ్ అన్నల జిందగి గందరగోళంలో పడింది. ఎన్నో ఆశలతో వచ్చిన కార్మికుల కలలు ఎండమావులుగా మారాయి. ఆర్ధిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపటంతో చాలా మంది ఉపాధి కొల్పోయారు. ఇంకా కొల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండియాలోనూ ఎన్నో దయనీయ దృశ్యాలు గుండె చెదిరేలా చేశాయి. కన్న ఊరును కలిసి పెరిగిన పల్లె జనాలను వదిలేసి పని కోసం పట్టెడన్నం కోసం వలస వెళ్లిన కార్మికుల కడుపులకి లాక్ డౌన్ లాక్ వేసేసింది. ఏ పూటకు ఆ పూట అన్నదాతల కోసం ఆత్రంగా ఎదురుచూసే యాచకులను చేసింది. దుర్భర జీవితాలను గడపలేక ఆకలితో అవస్థలు పడలేక వందలు, వేల కిలోమీటర్లు నడుస్తున్న  దృశ్యాలు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రయాణంలో అలిసిపోయి ప్రాణాలు వదలిన పేదల ఆకలి చావులు ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఈ కల్లోల సమయంలో కార్మికులారా.. మీకు ఎలా చెప్పాలి మే డే శుభాకాంక్షలు! ఈ గడ్డు కాలాన్ని దాటుకొని మరో కొత్త జీవితం కోసం గుండె దిటువు చేసుకొని మంచిరోజుల కోసం నీరిక్షించే నిస్సాయులం మనం.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com