భారత్, పాకిస్తాన్ కు టికెట్ల అమ్మకాలను ప్రారంభించిన ఫ్లై దుబాయ్

- May 07, 2020 , by Maagulf
భారత్, పాకిస్తాన్ కు టికెట్ల అమ్మకాలను ప్రారంభించిన ఫ్లై దుబాయ్

యూఏఈకి చెందిన ఫ్లై దుబాయ్ ఎయిర్‌లైన్స్ భారత్, పాకిస్తాన్ తో పాటు ప్రపంచదేశాలు వెళ్లేందుకు టికెట్ అమ్మకాలను ప్రారంభించింది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోయే రెగ్యూలర్ విమాన సర్వీసులకు సంబంధించి టికెట్లను అమ్ముతున్నట్లు ఎయిర్ లైన్స్ అధికార వర్గాలు తెలిపాయి. యూఏఈకి చెందిన మరో విమానయాన సంస్థ ఎయిర్ అరేబియా జూన్ 1 నుంచి విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే టికెట్ల అమ్మకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే..యూఏఈకి చెందిన మరో రెండు విమానయాన సంస్థలు ఎమిరాతి, ఎతిహాద్ టికెట్ల అమ్మకాలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇదిలా ఉంటే..ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా ఎయిర్ లైన్స్ బుకింగ్స్ ప్రారంభించటంతో యూఏఈలోని ట్రావెల్ ఎజెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రయాణికులకు ఆయా సంస్థల టికెట్లను అమ్ముకుంటున్నారు. అయితే..రెగ్యూలర్ విమాన సర్వీసులు మే 21 నుంచి ప్రారంభం అవుతాయని చెబుతున్నా దీనిపై గందరగోళం మాత్రం ఇంకా కొనసాగుతోంది. భారత్ తదితర దేశాల్లో విమాన రాకపోకలపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్ విమానాలు టేకాఫ్ కావాలంటే ఆయా దేశాల ప్రభుత్వాల అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ మే 21 నాటికి భారత్ అధికారుల నుంచి అనుమతి రాకుంటే విమాన సర్వీసులు మళ్లీ రద్దు అవుతాయని కూడా ట్రవెల్ ఏజెంట్స్ చెబుతున్నారు. ఒకవేళ విమాన సర్వీసులు రద్దైతే..టికెట్ డబ్బులు మాత్రం రీఫండ్ చేయబోమని కూడా స్పష్టంగా చెబుతున్నారు. అయితే..రీ బుకింగ్ గానీ, వోచర్స్ గానీ పొందవచ్చని చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్ని రద్దు కావటంతో విదేశీయులు లక్షల్లో యూఏఈలో చిక్కుకుపోయారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వెళ్లేందుకు వేల మంది ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ తమ దేశీయులను తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రత్యేక విమానాలను నడుపుతోంది. 63 వేల మందిలో 6 వేల మందిని స్వదేశానికి తీసుకెళ్లారు. భారత్ కూడా ప్రత్యేక విమానాల ద్వారా తొలివిడతగా అబుదాబి, దుబాయ్ నుంచి తమ దేశీయులను తరలిస్తోంది. శుక్రవారం తొలి ఫ్లైట్ ఇండియా చేరుకుంటుంది. దాదాపు 2 లక్షల మంది భారతీయులు స్వదేశాలకు వెళ్లేందుకు రాయబార కార్యాలయాల్లో పేర్లు నమోదు చేయించుకున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com