ఇరాన్‌లో మరోసారి కఠిన నిబంధనలు

- June 13, 2020 , by Maagulf
ఇరాన్‌లో మరోసారి కఠిన నిబంధనలు

ఇరాన్:ఇరాన్‌లో మరోసారి కఠిన నిబంధనలు విధించే అవకాశం ఉందని ఆ దేశాధ్యక్షుడు హసన్‌ రౌహాని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగాలంటే హెల్త్‌ ప్రొటోకాల్‌ తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తామని స్పష్టం చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి శనివారం ఆయన మాట్లాడుతూ.. కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రావిన్స్‌ల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

అదే విధంగా ఇరాన్‌లో కోవిడ్‌ వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న షియా ముస్లింల పవిత్ర స్థలం ఇమామ్‌ రెజా ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో యాత్రికులు హాజరుకావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాగా శనివారం ఒక్కరోజే ఇరాన్‌లో 2410 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..గడిచిన 24 గంటల్లో 71 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 1,84,955 దాటగా, మృతుల సంఖ్య 8730కి చేరింది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు కేసుల సంఖ్య పెరగడం గమనార్హం. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో అన్ని ప్రార్థనా స్థలాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com