వరదలో బురద రాజకీయం...(పొలిటికల్ ఫ్లడ్స్)
- October 20, 2020
వానంటే ఓ వరం. కానీ, భాగ్యనగరానికి మాత్రం భయం. వర్షం వస్తుందంటే..బీ సేఫ్, డోంట్ కమ్ ఔట్ సైడ్ అనే హెచ్చరికలు వినాల్సిన దుస్థితి ఏర్పడింది ఇప్పుడు. వారం రోజులుగా నీటిలో నానుతున్న నగర ప్రజలు...కనీసం నిత్యావసరాలు అందక నరకం అనుభవిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు..యధావిధిగా జనం కష్టాలను తమ పొలిటికల్ ప్రతిభను చాటుకునే వేదికలా మార్చుకుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల ముందు ప్రకృతి వైపరిత్యాన్ని క్యాష్ చేసుకునేందుకు తమకు చేతనైనంత మేర రాజకీయ బురద చేస్తున్నాయి.
దాదాపు వందేళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయి విపత్తు హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. భాగ్యనగరం చరిత్రలోనే ఈ స్థాయిలో వర్షాలు కురవటం ఇది రెండోసారి. సిటీ మొత్తం నీటిలో మునిగిపోయింది. అయితే..కొద్దిపాటి వర్షానికే రోడ్లు చెరువులు అవటం హైదరాబాద్ కు కొత్తేం కాదు. కానీ, వరద నీరు పోయి కొద్ది గంటల్లోనే మళ్లీ సాధారణ స్థితికి చేరుకునే నగరాన్నే మనం ఇన్నాళ్లు చూశాం. బట్ ఇప్పుడు మాత్రం కుండపోత వాన...వాన తర్వాత వాన..వరద మీద వరద. ఫలితంగా వారం నుంచి హైదరాబాద్ నీటిలో ఉంది. ప్రతి రోజు రోడ్లపై కాలువలను తలపించేలా నీటి ప్రవాహం కనిపిస్తోంది. జనం బయటికి రావాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వస్తోంది. నడుం లోతు నీటిలో ఇంట్లోని వస్తువులు పాడైపోయాయి. ఇంటికో విషాదగాధ వినిపిస్తోంది. నిత్యావసరాలు తెచ్చుకునే మార్గం లేదు. తెచ్చిచ్చే యంత్రాంగం కనిపిచంటం లేదు. ఇంతటి నరకం అనుభవిస్తున్న జనాలు సహజనంగానే కోపంతో రగిలిపోతున్నారు. కంటితుడుపు రాజకీయ నాయకులను మొహమాటం లేకుండా వరద నీటిలోనే కడిగిపారేస్తున్నారు.
అయితే..పొలిటికల్ లీడర్లు మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా బురదలోనే పొలిటికల్ ఫ్యూచర్ వెతుక్కుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ముందు తమ ఇమేజ్ పెంచుకునేందుకు అవస్థలు పడుతున్నారేగానీ, ప్రజలకు నిజంగా అవసరమైన సాయం మాత్రం సరిగ్గా చేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. పాలు, నీళ్లు వంటి నిత్యావసర సరుకులు అందించాలనే సోయి మరిచి..ప్రస్తుత పరిస్థితిలో ఎలా లాభం పొందాలనే రాజకీయ యావలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల ముందు జనం ఆవేశాన్ని చల్లబరిచే వ్యూహమోగానీ ఇంటికి పది వేలు ప్రకటించింది ప్రభుత్వం. ఇల్లు కూలిపోతే లక్ష, దెబ్బతిన్న ఇళ్లకు 50 వేలు అనౌన్స్ చేసింది. దీంతో వరదల మీద పొలిటికల్ గేమ్ ప్రారంభం అయ్యింది. పది వేల సాయాన్ని ఓ ప్రయోజనం లేని నాసిరకం సాయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలకు ప్రస్తుతం కావాల్సింది పది వేలు కాదని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందనే భరోసా, నమ్మకం ఇవ్వగలిగేలా యంత్రాంగం పని చేయాలని విమర్శలు చేస్తున్నాయి. నిజమే..నడుం లోతు నీటిలో, ఇంటి కప్పులపై గడిపే వారు తాగటానికి నీళ్లు, చంటిబిడ్డలకు పాలు, తమను సురక్షిత ప్రాంతానికి తరలించే యంత్రాంగాన్నే కోరుకుంటారు. ఆ తర్వాతే ఆర్ధిక సాయం, నష్ట పరిహారం గురించి ఆలోచిస్తారు. ప్రభుత్వ యంత్రాంగాలు కూడా ముందుగా అత్యవసర చర్యలు చేపట్టి ఆ తర్వాతే ఆర్ధిక సాయంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. కానీ, మళ్లీ వర్షాలు కురువొచ్చని వెదర్ రిపోర్ట్ భయపెడుతున్న వేళ లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే వ్యవస్థ అంత సమర్ధవంతంగా బాధ్యత నిర్వహిస్తున్న దాఖలాలు మాత్రం కనిపించటం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలే కాదు..ప్రతిపక్షాలు కూడా కొంచెం విచక్షణతో ఆలోచించి తమ వంతు బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి చేసే సూచనలతో ప్రభుత్వాన్ని కదిలించాల్సి ఉంటుంది. కానీ, పాలక ప్రతిపక్షాలు అన్ని ప్రజల శ్రేయస్సు కంటే గ్రేటర్ ఎన్నికల వ్యూహమే తమ అసలు లక్ష్యం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.
-- శ్రావణ్ (మాగల్ఫ్ ప్రతినిధి, తెలంగాణ)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!