ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్-నాగేంద్రకు నివాళులర్పించిన సినీప్రముఖులు

- October 27, 2020 , by Maagulf
ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్-నాగేంద్రకు నివాళులర్పించిన సినీప్రముఖులు

అమెరికా:‘చినుకులా రాలి.. నదులుగా సాగి’, ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అంటూ సాగే ఎన్నో అద్భుతమైన పాటలకు సంగీతం అందించి తెలుగువారి మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సంగీత దర్శకులు రాజన్‌-నాగేంద్ర ద్వయం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ అన్నదమ్ములు పలు భాషల్లో కొన్ని వందల చిత్రాలకు సంగీతం అందించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో రాజన్‌-నాగేంద్ర ద్వయానికి మంచి గుర్తింపు ఉంది. అయితే, ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా రాజన్‌ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది’ అనే పేరుతో రాజన్‌కు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

అమెరికా గాయని శారదా ఆకునూరి రూపకల్పన మరియు సారధ్యం లో, వంశీ ఇంటర్నేషనల్ఇండియా నిర్వహణలో అక్టోబర్ 24  వ తేదీ అంతర్జాలం లో జరిగిన రాజన్ ఘన నివాళికార్యక్రమం లో మురళీమోహన్‌, చంద్రమోహన్‌, భువనచంద్ర, రేలంగి నరసింహారావు, వై.వి.ఎస్‌.చౌదరి, వేటూరి రవిప్రకాశ్‌, ఎన్‌.బి.శాస్త్రి, సేఫ్ NGO భరద్వాజ తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి, రాము, ప్రవీణ్‌కుమార్‌ కొప్పొలు, ప్రసాద్‌ సింహాద్రి, తాతా బాల కామేశ్వరరావు, లండన్ నుండి డా.నగేష్ చెన్నుపాటి తదితరులు పాల్గొన్నారు. రాజన్‌-నాగేంద్ర ద్వయంతో తమకున్న అనుబంధాన్ని ఇతరులతో పంచుకున్నారు.

రాజన్‌-నాగేంద్ర ద్వయం పేరుపొందిన గొప్ప సంగీత దర్శకులు. నేను నటించిన కొన్ని సినిమాలకు వాళ్లు సంగీతం అందించారు. నేను నటించిన ‘నాగమల్లి’ ‘మూడు ముళ్ళు’, ‘ఇంటింటి రామాయణం’ లాంటి చిత్రాలకు వాళ్లు సంగీత దర్శకులుగా వ్యవహరించారు. తెలుగువారైన రాజన్‌-నాగేంద్ర కన్నడ చిత్రపరిశ్రమలో సైతం గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరమైన విషయం. తెలుగు గాయనీ గాయకులు కొంతమందిని కన్నడ ప్రేక్షకులకు వాళ్లే చేరువ చేశారు. ‘అగ్గిపిడుగు’ అనే తెలుగు చిత్రాన్ని కన్నడలో రాజకుమార్‌తో రీమేక్‌ చేయగా ఆ సినిమాకి రాజన్‌-నాగేంద్ర సంగీతం అందించారు. ఆ సినిమా విజయం సాధించడంతో వీరిద్దరూ అక్కడ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘సౌభాగ్యలక్ష్మి’ చిత్రంతో తెలుగులో అవకాశం పొందిన ఈ సంగీత ద్వయానికి ఎంతో మంది అభిమానులున్నారు. ‘పూజ’, ‘అద్దాల మేడ’, ‘నాలుగు స్తంభాలాట’ సినిమాల్లోని పాటలంటే నాకెంతో ఇష్టం. నా సినిమాల్లోని పాటలకు గుర్తింపు రావడానికి బాలు కూడా ఓ కారణం. నా కెరీర్‌కు బాలు ఐదో ప్రాణం.’ -చంద్రమోహన్

రాజన్‌-నాగేంద్ర.. తమ జీవితాలను సంగీతానికే అంకితం చేశారు. ఉన్నత విద్యలు అభ్యసించకపోయినా, శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా తండ్రి దగ్గర నుంచే కొంత సంగీతాన్ని నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయన్ని నేను వ్యక్తిగతంగా కలుసుకోలేదు కానీ ఆయన సంగీతం అందించిన పలు పాటలంటే నాకు బాగా నచ్చాయి. ఇటీవల రాజన్‌ మృతి.. సంగీతలోకానికి తీరనిలోటు.’- మురళీమోహన్

‘ఇంటర్‌లో ఉన్నప్పుడు నా ప్రాణ స్నేహితుడు ప్రమాదవశాత్తు కన్నుమూశాడు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డాను. బాగా ఏడ్చాను. ఆ  తర్వాత ఎన్నో సందర్భాల్లో బాధగా అనిపించింది కానీ కన్నీరు బయటకు రాలేదు కానీ గుండెలోనే ద్రవించింది. సామాన్య మానవుడు సైతం పాడుకునే విధంగా సంగీతాన్ని అందించగలిగిన వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆకాశంలో ఉన్నటువంటి సంగీతాన్ని నేలమీదకు దింపి ఇంటింటికి, ప్రతి ఒక్కరికీ చేరువ చేసింది తెలుగు సినిమా పరిశ్రమ. తనువును కదిలించేది తాళం. మనసును కదిలించేది రాగం. సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు.. ఈ ముగ్గరు పాటకు త్రిమూర్తులు. ఏ తరం వారినైనా ఆకట్టుకునే గొప్ప పాటలను రాజన్‌-నాగేంద్ర అందించారు. చనిపోయినప్పటికీ తాము సృష్టించిన కళల రూపంలో కళాకారులు ఎప్పటికీ బతికే ఉంటారు. ‘అప్పుల అప్పారావు’ సినిమా కోసం మొదటిసారి ఈవీవీ సత్యనారాయణ కలిసి పనిచేశాను. పాటకు సంబంధించిన సందర్భం చెప్పగానే ట్యూన్‌ పాడి వినిపించాను. ఇంతకీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు అని అడగగా.. ‘రాజన్‌-నాగేంద్ర‌’ అని ఈవీవీ అన్నారు. నాకెంతో సంతోషంగా అనిపించింది. నా జీవితంలో ఓ సంతోషకరమైన రోజది. రాజన్‌-నాగేంద్ర కంపోజ్‌ చేసిన పాటలు.. ‘సాంగ్స్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఎప్పటికీ అవి అలాగే మిగిలిపోయి ఉంటాయి.’ – భువనచంద్ర

రాజన్-నాగేంద్ర గార్లను  ముందుగా తెలుగు వారికి పరిచయం చేసిన బి.విఠలాచార్య కు  ధన్యవాదాలు  తెలియచేయాలి అన్నారు. - రేలంగి నరసింహారావు

చిన్నప్పటి నుండి పాటలతో తమ జీవితం పెనవేసుకుపోయిందని,  2018  లో  బెంగళూరు నుండి శ్రీ రాజన్ గారిని ఆహ్వానించి హైదరాబాదులో రాజన్ గారికి జీవిత సాఫల్య పురస్కారం, సద్గురు ఘంటసాల స్వర్ణపతకంతో  ఘనంగా సత్కరించడం మరియు "ఆరు దశాబ్దాల రాజన్-నాగేంద్ర సినీ గీత వైభవం" పేరిట ఆయన స్వరపరచిన అద్భుతమైన పాటలతో  సంగీత విభావరి ఆయన సమక్షంలో చెయ్యడం  తన అదృష్టం అని అన్నారు.- శారద ఆకునూరి

వేటూరి కుమారులు రవి ప్రకాష్ , జంధ్యాల తో అన్ని సినిమాలకు పనిచేసిన NB శాస్త్రి  రాజన్ తో వారికున్న ప్రత్యక్ష అనుబంధం గురించి మధురమైన జ్ఞాపకాలు  పంచుకుంటూ వారు సంగీతానికే వారి జీవితాన్ని అంకితం చేశారు అన్నారు.
సినీ నేపధ్య గాయకులు G.ఆనంద్ మాట్లాడుతూ రాజన్-నాగేంద్ర కంపొజిషన్స్ ఎంతో ఇష్టమనీ ఎన్నో పాటలు ఆయనవి స్టేజి మీద పాడానని ఆనందంగా  చెప్పారు.
గాయకులు బాల కామేశ్వరరావు, రాము, ప్రవీణ్. ప్రసాద్, శారద రాజన్-నాగేంద్ర ఎన్నో గీతాలను హృద్యం గా ఆలపించారు.

బెంగుళూరు నుండి రాజన్ కుమారులు  అనంత్  ఈ నివాళిని వీక్షించారు
వంశీ రామరాజు వందన సమర్పణ చేయగా, ఈ కార్యక్రమాన్ని డా తెన్నేటి సుధా, శైలజ సుంకరపల్లి పర్యవేక్షించారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com