దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

- November 13, 2020 , by Maagulf
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

న్యూ ఢిల్లీ:దేశ, విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులందరికీ వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.శోభాయమానమైన దీపమాలికల నడుమ సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంతో జరుపుకునే దీపావళి పండుగ చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతం. శ్రీ రాముని జీవితంలోని  ఉన్నత ఆదర్శాలు, నైతిక వర్తన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. త్రేతాయుగంలో శ్రీ రాముడు, రావణ సంహారం చేసి, 14 ఏళ్ళ వనవాసం అనంతరం సీతా, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజు ఇది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నరకాసురుణ్ని సంహరించి లోకానికి అతడి పీడను వదిలించిన ఆనందంలోనూ ప్రజలు దీపావళిని జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. 

దీపావళి రోజు రాత్రి సమయంలో సమస్తలోకానికి శ్రేయస్సును అందించే లక్ష్మీ దేవిని ఆరాధించడం సైతం ఆచారంగా వస్తోంది. సమాజంలో అక్కడక్కడా నెలకొని ఉన్న సామాజిక జాఢ్యాలను వదిలించుకుని మంచిని పెంచుకుని, సామరస్యంతో పంచుకోవలసిన అవసరాన్ని దీపావళి గుర్తు చేస్తుంది. 

భారతదేశ ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా దివ్య దీపావళిగా ఈ పండుగ వెలుగులు నింపుతోంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను వేడుకగా జరుపుకుంటారు.ఏటా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకగా జరుపుకునే పండుగ దీపావళి. కోవిడ్ -19 కారణంగా ఆరోగ్య అత్యవసర నేపథ్యంలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా, దీపావళిని జరుపుకోవాలని పిలుపునిస్తున్నాను.

ఈ దీపావళి పండుగ అజ్ఞాన తిమిరాలను పారద్రోలి, జ్ఞాన జ్యోతులను వెలిగించి, ప్రజలందరి జీవితాల్లోకి శాంతి, సామరస్యం, శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com