ఏపీలో యూకే కరోనా స్ట్రెయిన్ కలకలం...

- December 30, 2020 , by Maagulf
ఏపీలో యూకే కరోనా స్ట్రెయిన్ కలకలం...

అమరావతి:ఏపీలో యూకే కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది.రాష్ట్రంలో కరోనా కేసులు నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తున్న పరిస్థితుల్లో కొత్త కరోనా స్ట్రెయిన్ వ్యవహరం ప్రభుత్వానికి తలనొప్పులు సృష్టిస్తున్నాయి.  ఇటీవల యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు స్ట్రెయిన్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది. సీసీఎంబీ, ఎన్‌ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించారు. సదరు మహిళ 10 రోజుల క్రితం కుమారుడితో సహా యూకే నుంచి రాజమండ్రి వచ్చారు. ఆమె కుమారుడి సహా కుటుంబసభ్యులకూ కరోనా నెగెటివ్‌ నిర్ధారణ అయింది. రాజమండ్రి నుంచి మహిళ నుంచి మరెవరికీ స్ట్రెయిన్‌ సోకలేదని  వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. యూకే స్ట్రెయిన్‌ రాష్ట్రంలో విస్తరించిన దాఖలాలులేవని  తెలిపింది. అపోహలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది వైద్య ఆరోగ్యశాఖ. 

ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య రెండు నుంచి మూడు వందల మధ్యలో నమోదు అవుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఏపీలో కరోనా కేసుల సంఖ్య చాలా వరకు తగ్గినట్టేనని అధికారులు ఊపిరి పీల్చుకునేంతలోనే కొత్త స్ట్రెయిన్ టెన్షన్ పెడుతోంది.    ఇప్పటి వరకు యూకే నుంచి  రాష్ట్రానికి 14 వందల 23 మంది వస్తే.. వారిలో 12 మందికి కరోనా వైరస్ సోకింది. అయితే ఇలా కరోనా వైరస్ సోకిన వారిలో ఒకరికి యూకే స్ట్రెయిన్ వచ్చినట్టు నిర్ధారించింది ప్రభుత్వం. ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు యూకే నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేయడం.. వారి కాంటాక్టులను పసిగట్టే పనిలో నిమగ్నమైంది.  సుమారు 6364 మంది మీద నిఘా పెట్టింది. వీరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది ప్రభుత్వం.  ఈ క్రమంలో పుణే వైరాలజీ ల్యాబుకు.. సీసీఎంబీకి పంపిన నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంటుంది.   మరోవైపు భారత దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరుగురికి స్ట్రెయిన్‌ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com