'వర్క్ ఫ్రొం హోమ్' వారికి గూగుల్ మీట్ ఆఫర్

- April 01, 2021 , by Maagulf
\'వర్క్ ఫ్రొం హోమ్\' వారికి గూగుల్ మీట్ ఆఫర్

ఇంటినుంచి పనిచేసే ఉద్యోగులు తరచుగా వీడియో మీటింగ్స్‌కు హాజరు కావాల్సి వస్తోంది. కరోనా తరువాత జూమ్, గూగుల్ మీట్, ఇతర ప్లాట్‌ఫాంలు వీడియో మీటింగ్స్, ఆన్‌లైన్ క్లాసుల కోసం ప్రత్యేక ఫీచర్లను అభివృద్ధి చేశాయి. తాజాగా గూగుల్ మీట్ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వీడియో కాల్స్‌, మీటింగ్స్‌ను 24 గంటల పాటు ఉచితంగా అందించే ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ సంవత్సరం జూన్ వరకు ఈ సదుపాయాన్ని కస్టమర్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. గూగుల్ ఇంతకు ముందు కూడా అన్‌లిమిటెడ్ మీట్ కాల్స్‌ను మార్చి 31 వరకు పొడిగించింది. ఈ వివరాలను గూగుల్ వర్క్ స్పేస్ ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. గత ఏడాది గూగుల్ హ్యాంగ్ అవుట్‌ను గూగుల్ మీట్‌గా రీబ్రాండ్ చేసింది. కోవిడ్‌కు ముందు దీని ద్వారా 60 నిమిషాల వరకు అన్‌లిమిటెడ్ వీడియో కాల్స్ చేసుకునే వీలు కల్పించింది. ఆ తరువాత లాక్‌డౌన్‌లో ఇంటి నుంచి పనిచేసేవారి సంఖ్య పెరగడంతో ఈ పరిమితిని పెంచింది. 24 గంటలూ వీడియో కాల్స్, మీటింగ్స్ నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. 100 మందిని మీటింగ్‌లో యాడ్ చేసే ఆప్షన్‌ను కూడా అభివృద్ధి చేసింది.

ఇంతకు మించి సబ్‌స్క్రైబర్స్‌ను మీటింగ్స్‌కు యాడ్ చేయాలంటే గూగుల్ వర్క్‌ స్పేస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ముందు గూగుల్ అకౌంట్ ఉన్న కస్టమర్లందరికీ గూగుల్ మీట్‌ సేవలను సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అందిస్తామని సంస్థ ప్రకటించింది. కానీ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా రెండో దశలో కరోనా విజృంభణ మొదలైంది. దీంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌ అవకాశాన్ని పొడిగించాయి. అందువల్ల గూగుల్ మీట్ ఉచిత సేవలను 2021 మార్చి వరకు పొడిగించింది.

తాజాగా మరోసారి జూన్ వరకు ఈ గడువును గూగుల్ పొడిగించింది.ఇటీవల గూగుల్ మీట్ సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. యాప్‌ ద్వారా మీటింగ్స్‌లో పాల్గొనే అందరినీ స్మార్ట్‌ ఫోన్‌లో టైల్ వ్యూలో చూసే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com