'గల్ఫ్' సినిమా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి తో ముఖాముఖి

- March 04, 2016 , by Maagulf
'గల్ఫ్' సినిమా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి తో ముఖాముఖి

ప్రశ్న 1 : సినిమా రంగం వైపు ఆలోచనలు ఎలా సాగాయి?.

జవాబు  : ఇంజనీరింగ్ పూర్తి చేసాక,సివిల్ సర్వీస్ కు  ప్రిపేర్ అవ్వడానికి నేను హిస్టరీ, సోసియాలజిలని సబ్జెక్ట్స్  ఎంచుకున్నాను ఆ ప్రిపరేషన్ టైంలో నా చుట్టూ వున్న సామాజికా స్థితిగతులను, వ్యవస్థను ఎకడమిక్ గా ఒక విద్యార్థిగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. అది నన్ను జర్నలిస్ట్ గా ముందుకు అడుగులు వెయ్యించింది. విశాఖలో ఒక మాస పత్రిక, దిన పత్రిక నడుపుతున్న సమయంలో మన చుట్టు జరుగుతున్న సామాజిక సమస్యల్ని చర్చించడానికి, ప్రశ్నలను సంధించడానికి సినిమాయే చాలా మంచి సాధనమనిపించింది అదే నన్ను సినిమా రంగం వైపు అడుగులు వెయ్యించింది.

 

ప్రశ్న 2 : దర్శకత్వం పైన ఆలోచన ఎందుకు వచ్చింది?.

జవాబు : సినిమా మాధ్యమo ద్వారా నా భావాల్ని వ్యక్తపరచడానికి ఒక కధకుడిగా, మాటల రచయితగా, పాటల రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా, దర్శకుడిగా మారవలిసి వచ్చింది. సినిమాలో ఇన్ని విభాగాలు చెయ్యాలని చెయ్యలేదు. నా కళ్ళ ముందు కనిపించిన దృశ్యాన్ని తెరమీద తీసుకొచ్చే ప్రయత్నంలో జరిగినవే పైవన్నీ.

 

ప్రశ్న 3 : కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మీ ఆలోచనలు సాగడం పైన ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?.

జవాబు : నా దృష్టిలో ధియేటర్ లో రిలీజైన ప్రతి సినిమా కమర్షియల్ సినిమానే. కొన్నింటిని ప్రేక్షకులు ఆదరిస్తారు, కొన్నిoటిని ఆదరించరు.సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమం. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే సమాజానికి చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం. అందులో భాగంగానే నా  ఈ ప్రయత్నం.నా పంధాలో తీసిన సినిమాలు సైతం క్రిటిక్స్ నుండి ప్రసంశలు, ఆడియన్స్ నుండి ఆర్ధిక విజయాల్ని అందుకున్నాయి. కొన్ని అపజయాల్ని కూడా చవి చూసాయి. సినిమా అంటేనే రిస్క్. అది సోకాల్డ్ కమర్షియల్ సినిమా తీసేవారికీ ఉంటుంది. ఒక జర్నలిస్ట్ గా సినిమాని అప్రోచ్ కావడాన్ని నేను ఇష్టపడతాను. అవి కమర్షియల్ గా విజయవంతం కావాలని కూడా ప్రయత్నం చేస్తాను.

ప్రశ్న 4 : కమర్షియల్ డైరెక్టర్ గా అనిపించుకోవాలని లేదా?.

జవాబు : మేము చెయ్యబోయే తదుపరి సినిమాకి ఏ కధ తీసుకుంటున్నారని కాక ఏ టాపిక్ తీసుకుంటున్నారని సగటు ప్రేక్షకుడు మమ్మల్ని అడుగుతున్నప్పుడు అది ఒక విజయంగా అనిపిస్తుంది నాకు. సమాజానికి ఉపయోగపడే అంశాల్ని ఇతివృత్తంగా తీసుకునే దర్శకుడు అని ప్రేక్షకులు అనుకుంటే చాలు వాటిని విజయవంతం చేసి నన్ను వాళ్ళు కమర్షియల్ డైరెక్టర్ చేస్తే మా టీం అంతా హ్యాపి గా ఫీలవుతాము.

 

ప్రశ్న 5 : ఇప్పుడున్న తెలుగు సినిమా కమర్షియల్ ట్రెండ్ పై మీ అభిప్రాయం?.

జవాబు : ప్రతి దర్శకుడికి ఒక్కొక పంధా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక మంచి పాయింటు చెప్పాలనే ప్రయత్నం చేస్తారు. కొందరు కేవలం వినోదం అందించాలనుకుంటారు. కొందరు యాక్షన్ చూపించాలనుకుంటారు ఇవన్నీ సమాజానికి అవసరమే. ప్రేక్షకుడ్ని నవ్విస్తూ ఉత్తేజ పరిచే సినిమాలు కూడా సమాజానికి కావాలి బాగా తీసిన కమర్షియల్ సినిమా అందరికీ మంచే చేస్తుంది.

 

ప్రశ్న 6 : గల్ఫ్ సినిమా విశేసాలేంటి ?

జవాబు : నేను చేసే ప్రతి సినిమాకి చాలా వరకు రీసెర్చ్ వర్క్ చేస్తుంటాను.ఈ సబ్జెక్ట్ కి అది చాలా ఎక్కువగా అవసరమైంది.GCC దేశాలలో ఉన్న చాలామంది తెలుగువాళ్ళు వాళ్ళ అనుభవాలని విశేషాలని నాతో పంచుకున్నారు.  నాలుగు దేశాలలో తెలుగువారిని కలిసి ప్రత్యక్షంగా వాళ్ళ ఫీడ్ బ్యాక్ ని తీసుకున్నాను అలాగే వలసలు ఎక్కువగా ఉండే ప్రతి జిల్లాలలో నా టీం తో టూర్ చేసి మీటింగ్ లు పెట్టి వాళ్ళ నుండి విషయాలు  ముటగట్టుకున్నాo.ఈ సబ్జెక్ట్ విషయంలో నాకు సహాయ సహకారాలు అందిచ్చిన అందరి మిత్రులకు పాత్రికేయులకు మీ ద్వార కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. టెక్నికల్ గా కూడా ఈ సినిమా స్టొరీ  క్రెడిట్ ని నాతో వాళ్ళ అనుభవాలని పంచుకున్న అందరికి ఇస్తున్నాం. సినిమా షూటింగ్ రెండు షెడ్యుల్ జరుపుకుంది. ఉతరాంద్ర, కరీంనగర్, హైదరాబాద్ పరిసరాలలో జరిగింది.ఇందులో జీవా, నాగినీడు, జబర్దస్త్ వేణు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ లతో కొంతమేర షూటింగ్ చేసాం.’’ మే ’’ తో చిత్రీకరణ పూర్తిచేసి ‘’ జూన్ ‘’, ‘’ జూలై ’’ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.

 

 ప్రశ్న 7 : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వచ్చిన వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎన్ని చిత్రాల్లో చూపించారు. మీరు చూపించాబోయే కొత్త కోణం ఏమిటి?.

జవాబు : గల్ఫ్ గురుంచి ఒకరకంగా చెప్పాలంటే తెలుగులో రావలసినన్ని సినిమాలు రాలేదనే నా భావన. మనదేశంలో NRI లంటే మనసుకి గుర్తొచ్చేది అమెరికాలో ఉన్న వాళ్ళే గాని గల్ఫ్ లో ఉన్న వాళ్ళు కాదు, మన గణాంకాలు చూస్తే అమెరికా  నుండి మన దేశానికి వస్తున్న విదేశి మారక ద్రవ్యంకంటే మూడు రెట్లు ఎక్కువగా పంపుతున్నది గల్ఫ్ నుండే. గల్ఫ్ కి చెందిన ప్రవాసుల పట్ల ఉదాసీనత ప్రభుత్వం లోను మీడియాలోను ఉందనేది నా బావన. వారు అందిస్తున్న కాంట్రిబ్యూషన్ ని ఎకనాలేజ్  చేయడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. ఒక ఇంటర్వ్యువ్ లోనో, సినిమాలలోనో పూర్తిగా చెప్పెయ్య గలిగే చిన్న విషయం ఇది కాదు అని నాకు తెలుసు. సాధ్యమైనoతవరకు, గల్ఫ్ లో ఉన్న విభిన్న కోణాలను విజయాల్ని, అపజయాల్ని, కారణాలని, సూచనలని, వినోదం మిస్ కాకుండా ఒక చక్కటి ప్రేమకథను ఫోర్ గ్రౌండ్ లో ఉంచుతూ చూపుతున్న విజువల్  ప్రెజెంటేషన్ ఈ సినిమా. ముందుగా చెప్పిన్నట్టు ఇందులో ప్రతి దృశ్యం ఇక్కడ ప్రవాసీయుల జీవితాన్ని ఆధారంగా తీసుకుని  మలచాబడుతున్నదే.

 

ప్రశ్న 8 : దర్శకుడిగా తెలుగు సినీ రంగంలో మీప్రయాణం సాఫీగా సాగిపోతుందా?.

జవాబు : 15 సంవత్సరాలు, 15 సినిమాలు, 18 నంది అవార్డులు , 25 అంతర్జాతీయా చిత్ర ప్రదర్శనలో ఎంపికలు, 5 కమర్షియల్ విజయాలు ఇది శ్రావ్య ఫిలిoస్ ప్రయాణం. ఇది సాధ్యపడటానికి తోడుగా ఉన్న నా మిత్రుడు నిర్మాత రవీంద్ర బాబు, టెక్నిషియన్స్, ఆర్టిస్ట్ ల సహకారంతో చాలా చాలా సాఫీగా సాగిపోతున్నదనే నా అభిప్రాయం.

 

ప్రశ్న 9 : సినిమా రంగంలో కొత్తగా వచ్చేవారికి మీరిచ్చే సలహా?.

జవాబు : మనసుకు నచ్చిన సినిమా తియ్యండి. ఎవ్వరికో నచ్చాలని కాకుండా ముందుగా మీకు నచ్చిన సినిమా తియ్యండి ఇది చాలా సందర్భాల్లో అందరికీ నచ్చుతుంది. సినిమా చాలా పవర్ పుల్ మాధ్యమం దాన్ని సరిగ్గా వాడుకుంటే అందరికీ మంచి చేస్తుంది.

 

ప్రశ్న10 : తదుపరి సినిమాలేంటి ?

జవాబు : రెండు సబ్జెక్ట్స్ వర్క్ జరుగుతు ఉంది. త్వరలో తమిళ్ లోను మళయాలంలోను ఒక్కొక సినిమా చేస్తుంది మా సంస్థ.

 

ప్రశ్న11 : మీ నుంచి కమర్షియల్ సినిమాలు ఆశించవచ్చా?.

జవాబు : తప్పకుండా! కానీ మేము తీసే సినిమాలు విజయవంతం చేయ్యడం ఆడియన్స్ చేతిలోనే  వుంటుంది. మా ప్రయాత్నాల్ని  ఆదరిస్తే అవి మంచి కమర్షియల్  సినిమాలే అవుతాయి. అలా మీరందరూ ఆదరించి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు .

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com