ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక పునరుజ్జీవం కోసం ప్రభుత్వాలు టీమ్ ఇండియా స్ఫూర్తి పని చేయాలి
- September 11, 2021
చెన్నై: దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమ్ ఇండియా స్ఫూర్తితో పని చేయాలని, తద్వారా అన్ని రంగాల్లో భారతదేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
హిందుస్థాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమృతోత్సవ (ప్లాటినం జూబ్లీ) వేడుకలకు ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలు విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఫలితంగా 2021 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం పెరుగుదలతో మొత్తం విదేశీ పెట్టుబడుల రాక 81.72 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉందన్నారు. ఆర్థికాభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య సహా వివిధ రంగాల్లో ప్రభుత్వ – ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అత్యంత ఆవశ్యకమని ఆయన నొక్కిచెప్పారు.

కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, రెండో వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కాస్తంత మందగించినప్పటికీ, త్వరలోనే కోలుకోవడమే గాక, మరింత వేగంగా ఈ ప్రక్రియ కొనసాగేలా దృఢంగా నిబడ్డామని తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించిన సమయానుకూల చర్యలతో పాటు, విధానపరమైన సంస్కరణల కారణంగా పరిస్థితి మరింత మెరుగుపడుతోందన్నారు. భారతదేశం ఆర్థిక పరివర్తనలో ముందంజలో ఉందన్న ఆయన, అన్ని సూచికలు రాబోయే నెలల్లో వృద్ధి, పునరుద్ధరణ యొక్క దీర్ఘకాలిక దశలను ఆవిష్కరిస్తాయని తెలిపారు. వివిధ సూచీల ఆధారంగా 2021-22లో భారతీయ రిజర్వు బ్యాంకు 9.5 శాతం వృద్ధి అంచనా ఉందన్నారు.

బలమైన స్థూల ఆర్థిక మూలాలు (మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్), భవిష్యత్ అంచనా సంస్కరణలు(ఫార్వర్డ్ లుకింగ్ రీఫార్మ్స్), ఎఫ్.డి.ఐ.లను తెరవడం, సులభతరమైన వ్యాపారాన్ని మెరుగుపరచడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకునే అవకాశం ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు.
విద్యావంతులు, ప్రతిభావంతులైన యువత, శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన మానవ వనరులను భారతదేశానికి గొప్ప వరంగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులను మరింత పెంచడం ద్వారా ఆవిష్కరణలు వృద్ధి చెందే సరైన వాతావరణాన్ని సృష్టించడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకమన్న ఆయన, హిందుస్థాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటి సంస్థలు ఈ దిశగా మరింత చొరవ తీసుకుని, కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. హిందుస్థాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థలు యువతకు శిక్షణ మరియు నైపుణ్యాన్ని అందించాలన్న ఉపరాష్ట్రపతి, యువత ఉపాధి పొందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పించే వారుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. యువతను ఉద్యోగార్థులుగా గాక, ఉద్యోగాల సృష్టికర్తలుగా చూడాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన ఆయన, ఈ దిశగా యువతకు అవసరమైన నైపుణ్యాన్ని, శిక్షణను అందించేలా చొరవ తీసుకోవాలని సూచించారు.
ఇటీవల చరిత్రను తిరగరాయాల్సిన అవశ్యకత గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భారతీయ ఉపఖండం చరిత్రను రాసేటప్పుడు, చదివేటప్పుడు భారతీయ దృష్టికోణంతో చూడాలే తప్ప, వలసవాద దృష్టి కోణంలో చూడడం భవిష్యత్ కు మేలు చేయదని తెలిపారు.

ప్రతిభావంతులు, నిపుణులు, కష్టపడి పని చేసే ప్రజలను తమిళనాడుకు గొప్ప ఆస్తిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, రవాణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఉన్న తమిళనాడు పెట్టుబడులకు మంచి ఆకర్షణీయమైన ప్రదేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, మణిపూర్ గవర్నర్ ఎల్.గణేశన్, అపోలో గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రతాప్ సి. రెడ్డి, అమృతోత్సవాల (ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్) చైర్మన్ అశోక్ ఆర్. టక్కర్, హిందుస్థాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రస్తుత అధ్యక్షుడు సత్యనారాయణ ఆర్.దవే, భావి అధ్యక్షుడు కె.సురేష్ సహా పలువురు ప్రతినిధులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, హిందుస్థాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







