పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం: ఉపరాష్ట్రపతి

- October 09, 2021 , by Maagulf
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం: ఉపరాష్ట్రపతి
ఈటానగర్: ఏడేళ్లుగా ఈశాన్యభారతంలో వస్తున్న మార్పులు, ఈ ప్రాంతం భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతం ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండటాన్ని ప్రస్తావిస్తూ.. ఈశాన్య భారతం పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తోందని, ఈ ప్రాంతాభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఏడేళ్లుగా భారతదేశ ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు శక్తుల ప్రభావం తగ్గుతూ వస్తోందన్నారు.
 
శనివారం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. 2014 నుంచి అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా చేస్తున్న కృషిని కొనియాడారు.భారతదేశంలో ఇటీవలి కాలంలో చట్టసభల పనితీరును ప్రస్తావిస్తూ, పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రజల సమస్యలను ప్రస్తావించి, చర్చించి వాటికి పరిష్కారం సూచించే బదులు, అనవసర వాదులాటల ద్వారా సభా సమయాన్ని వ్యర్థం చేయడం సరికాదన్నారు.2015-20 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కనిష్టంగా ఒకరోజు, గరిష్టంగా ఆరు రోజులపాటు సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ధోరణి ఆందోళనకరమన్నారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ తమ సమావేశాల సమయాన్ని కాస్త పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. 8 రాష్ట్రాల్లోని శాసనసభల్లో కేవలం 20 మంది మహిళా శాసనసభ్యులున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తం 498 మంది శాసనసభ్యుల్లో 4 శాతం మాత్రమే మహిళలుండటం సరికాదని, చట్టాల రూపకల్పనలో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలని సూచించారు. 
 
చట్టసభల్లో ప్రజోపయోగ అంశాలపై వాదోపవాదాలు జరిపి, కూలంకశంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.ఈ ప్రాంతంలో అభివృద్ధి మరింత వేగం పుంజుకునేందుకు ఉపరాష్ట్రపతి 15 సూత్రాలను ప్రతిపాదించారు. అన్ని సంప్రదాయ వర్గాలు ఓ ప్రత్యేకమైన స్ఫూర్తితో ముందుకెళ్లడం, అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యల పరిష్కారం, తిరుగుబాటుదారులు, వారి ద్వారా ప్రేరేపితమవుతున్న హింసకు చరమగీతం పలకటం, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, అభివృద్ధి, ప్రజాస్వామ్యాలను సమానస్థాయిలో ముందుకు తీసుకెళ్లడం, సానుకూల ఆర్థిక విధానాలతో ఆత్మనిర్భరతను పెంచుకోవడం, కేంద్ర నిధులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ సొంతగా ఆర్థిక వసతులను సమకూర్చుకోవడం, మానవ - ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటూ పరిపాలనలో జవాబుదారీ, పారదర్శకతను పెంపొందించుకోవడం, విధివిధానాల రూపకల్పనలో వివిధ సామాజిక వ్యవస్థలను భాగస్వాములు చేయడం, వ్యాపారానుకూల వాతావరణాన్ని ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులువేయడం తదితర అంశాలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.
 
ఏడేళ్లుగా వస్తున్న మార్పులతో ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాల కల్పన విస్తృతంగా జరుగుతోందని తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి బాటలు పడుతున్నాయని ఆయన అన్నారు. భిన్న వర్గాల ప్రజలకు నిలయమైన ఈశాన్య భారతంలో అన్నివర్గాలను కలుపుకుంటూ అసమానతలకు తావులేకుండా ముందుకెళ్లాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 2014లో ప్రధానమంత్రి ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని తీసుకొచ్చే వరకూ ఈ ప్రాంతంలో ఆకాంక్షలకు, వాటిని పూర్తిచేయడానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేదన్నారు.మానవాభివృద్ధి సూచీ-2019 ప్రకారం, ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు జాతీయ సగటుకంటే మంచి స్థానంలో నిలిచిందన్న ఉపరాష్ట్రపతి, ఈశాన్య భారతం 78.50% అక్షరాస్యతను కనబర్చడాన్ని అభినందించారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం బోడో, కార్బీ అంగ్లాంగ్ ఒప్పందాలు కుదర్చుకున్న విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అభివృద్ధి సాధించేందుకు శాంతిపూర్వకమైన వాతావరణం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
 
అరుణాచల్ ప్రదేశ్‌ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు ఇతర భాగస్వామ్య పక్షాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. రాష్ట్రంలో శిశు మరణాల సంఖ్య తగ్గడం, నిరక్షరాస్యత, లింగ నిష్పత్తిలో అంతరం, విద్యార్థుల డ్రాప్ అవుట్ల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల, రోడ్ల అనుసంధానత పెరగడం తదితర అంశాలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించి, అభినందించారు.
 
శాసన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం... అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, డోర్జీ ఖండూ సమావేశ ప్రాంగణాన్ని ఉపరాష్ట్రపతి జాతికి అంకింత చేశారు. అనంతరం ప్రాంగణంలలో కాగిత పునర్వినిమయ (రీసైక్లింగ్) యూనిట్ ను ప్రారంభించారు.కాగిత రహిత విధానాన్ని అమలుచేస్తున్న దేశంలోని మూడో రాష్ట్రంగా, ఈశాన్య భారతంలోని తొలి రాష్ట్రంగా నిలిచిన అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్  ప్రసాంగ్ దోర్, రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ, విపక్షనేతలోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com