జీవితకాల అధినాయకుడిగా జిన్‌పింగ్‌! కీలక నిర్ణయం తీసుకోనున్న డ్రాగన్‌ కంట్రీ

- November 09, 2021 , by Maagulf
జీవితకాల అధినాయకుడిగా జిన్‌పింగ్‌! కీలక నిర్ణయం తీసుకోనున్న డ్రాగన్‌ కంట్రీ

బీజింగ్‌: చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సోమవారం నుంచి బీజింగ్‌లో జరుపుకొంటున్న నాలుగు రోజుల ప్లీనరీ సమావేశం పార్టీ నూరేళ్ల చరిత్రలో అరుదైన 'చరిత్రాత్మక తీర్మానాన్ని' ఆమోదించి, షీ జిన్‌పింగ్‌ మూడోసారి దేశాధ్యక్షుడిగా కొనసాగడానికి పచ్చజెండా ఊపనున్నది. ఈ సమావేశాల్లో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్టీ మహాసభలు సాధికారంగా జిన్‌పింగ్‌ను మళ్లీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తన నూరేళ్ల చరిత్రలో ఇంతవరకు రెండే రెండు చరిత్రాత్మక తీర్మానాలు చేసింది. ఈసారి ఆమోదించేది మూడో తీర్మానమవుతుంది. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి, చరిత్ర గతిని మార్చడానికి చరిత్రాత్మక తీర్మానాలు చేస్తారు. వాటికి అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఉంది. 2022లో జరిగే పార్టీ మహాసభలు మూడోసారి జిన్‌పింగ్‌ నాయకత్వానికి సాధికారంగా ఆమోద ముద్ర వేసినా, ఆయన వారసుడెవరో తేల్చకుండా వదిలేస్తాయని నిపుణుల అంచనా. దీన్ని బట్టి జిన్‌పింగ్‌ జీవితకాల అధినాయకుడిగా కొనసాగడమో, లేదా 2027లో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడమో జరుగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పట్లో ఆయనకు రాజకీయ వారసుడెవరూ ఆవిర్భవించే అవకాశాలు కనిపించడం లేదు.

అన్నింటికీ మినహాయింపు
మరోవైపు చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్‌ తోపాటు అనేకమంది ఉన్నత స్థాయి నాయకులు రెండు పదవీ కాలాలు పూర్తి చేసుకున్న తరవాత పదవీ విరమణ చేస్తారని అంచనా. ఉన్నత నాయకులెవరూ రెండు సార్లకు మించి పదవిలో కొనసాగకూడదనీ, 68 ఏళ్లు నిండిన తరవాత రిటైరైపోవలసిందేనని కమ్యూనిస్టు అధినేత మావో జెడాంగ్‌ తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్‌ జియవోపింగ్‌ నిర్దేశించారు. దీనికి 68 ఏళ్ల జిన్‌పింగ్‌ మినహాయింపుగా నిలుస్తున్నారు. దేశాధ్యక్షునికి రెండు పర్యాయాల పదవీకాల పరిమితి వర్తించదని 2018నాటి కీలక రాజ్యాంగ సవరణ స్పష్టం చేయడమే దీనికి కారణం. మరోవైపు, పార్టీలో శక్తిమంతమైన పొలిట్‌ బ్యూరోలోని 25 మంది సభ్యుల్లో దాదాపు సగం మందికి వచ్చే ఏడాది అక్టోబరుకల్లా 68 ఏళ్లు నిండుతాయి. మరి వారి భవితవ్యం ఏమిటో తెలియదు.

అధికారాలన్నీ జిన్‌పింగ్‌ చేతుల్లోనే
జిన్‌పింగ్‌ చైనాలోని మూడు అధికార కేంద్రాలకూ నాయకుడిగా కొనసాగుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చైనా సాయుధ దళాల అధిష్టానమైన కేంద్ర మిలిటరీ కమిషన్‌ చైర్మన్‌గా, దేశాధ్యక్షుడిగా తనే చక్రం తిప్పుతున్నారు. గడచిన తొమ్మిదేళ్ల పదవీ కాలంలో జిన్‌పింగ్, చైనా కమ్యూనిస్టు అధినాయకుడు మావో జెడాంగ్‌ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడిగా ఆవిర్భవించారు. మావో తరవాత జిన్‌పింగ్‌ను 2016లో కీలక నాయకుడిగా ప్రకటించి. పార్టీ రాజ్యాంగంలో ఆ అంశాన్ని పొందుపరిచారు. 'ఇది పార్టీకీ, దేశానికీ, చైనా ప్రజలకు పెద్ద వరం' అని కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్‌ డైలీ కొనియాడింది. 2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైనప్పటి నుంచి జిన్‌పింగ్‌ చైనాను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దారనీ, ఆయన నాయకత్వంలో చైనా నవ బలాధిక్య యుగంలో ప్రవేశిస్తోందనీ, చరిత్ర గతిని మార్చే కీలక నాయకుడిగా ఆయన చరితార్ధుడయ్యారనీ అధికార వార్తా సంస్థ కీర్తించింది. కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశంలో చర్చించడానికి పొలిట్‌ బ్యూరో సమర్పించిన అధికార ప్రకటన చైనా కమ్యూనిస్టు పార్టీ తన వందేళ్ల చరిత్రలో సాధించిన విజయాలనూ, జిన్‌పింగ్‌ నాయకత్వంలో సాధించిన పురోగతినీ ఏకరవు పెట్టింది. చైనా అంతర్జాతీయంగా తన హోదాను ఇనుమడింపజేసుకుందని ఆ ప్రకటన ఉద్ఘాటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com