దక్షిణాది రాష్ట్రాల భేటీ..తెలుగు రాష్ట్రాలకు నిరాశే..జగన్ కు మరో మాటిచ్చిన అమిత్ షా

- November 15, 2021 , by Maagulf
దక్షిణాది రాష్ట్రాల భేటీ..తెలుగు రాష్ట్రాలకు నిరాశే..జగన్ కు మరో మాటిచ్చిన అమిత్ షా

ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న ఆరోపణల మధ్య జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ నిరాశనే మిగిల్చింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కేంద్రం ముందు పెట్టిన డిమాండ్లను హోంమంత్రి అమిత్ షా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం తన శాఖ అజెండాలో భాగమైన శాంతిభద్రతలు, నేరాలపైనే అన్ని రాష్ట్రాలకు షా దిశానిర్దేశం చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కంఠశోషే మిగిలింది.

దక్షిణాదిపై కేంద్రం చిన్నచూపు 
దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరికి సంబధించిన సమస్యలు నానాటికీ పెరుగుతున్నా, అంతర్ రాష్ట్ర వివాదాలు ముదురుతున్నా కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదు. అంతెందుకు ఏపీ, తెలంగాణ మధ్య మొదలైన జల వివాదాల్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకుని మొత్తం పెత్తనాన్ని రివర్ బోర్డుల రూపంలో తన చేతుల్లోకి తీసేసుకుంది. ప్రతీ ఏటా బడ్జెట్ లో సైతం దక్షిణాది రాష్ట్రాలకు మొండిచేయి చూపుతోంది. దీంతో దక్షిణాది విషయంలో కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న భావన రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ జరిగింది.

సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ
దక్షిణాదికి సంబంధించిన ఎన్నో కీలక సమస్యలు పెండింగ్ లో ఉన్న తరుణంలో కేంద్రం తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో పరిష్కారం చూపుతుందని, కనీసం ఏపీ, తెలంగాణ విషయంలో గతంలో ఇచ్చిన విభజన హామీల్ని అయినా నెరవేర్చేదిశగా ఓ అడుగు అయినా పడుతుందని ఆశించారు. సీఎం జగన్ అయితే ఏపీకి విభజన హామీల విషయంలో జరిగిన అన్యాయంతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని సుదీర్ఘంగా అమిత్ షా ముందు ఏకరువు పెట్టారు. అలాగే తెలంగాణ ప్రతినిధిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ కూడా విభజన హామీల సహా జల వివాదాలు, ఇతర కీలక సమస్యల్ని ప్రస్తావించారు. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా తమ సమస్యల్ని వినిపించాయి.

హామీల అమలుకు తెలుగు రాష్ట్రాల పట్టు
2014 నాటికి ఏపీ విభజన చట్టంలో ఏపీ, తెలంగాణకు కేంద్రం భారీగా హామీలు ఇచ్చింది. వీటి పరిష్కారానికి కేంద్రం ఈ ఏడేళ్లలో చేసిన ప్రయత్నాలు నామమాత్రమే. దీంతో ప్రతిసారీ కేంద్రాన్ని కలిసినప్పుడల్లా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, ఇతర మంత్రులు, ఎంపీలు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న ఏపీ, తెలంగాణ నుంచి ప్రతినిధులుగా హాజరైన జగన్, మహమూద్ అలీ కూడా విభజన హామీల అమలుకు పట్టుబట్టారు. సీఎం జగన్ అయితే ఏకంగా అమిత్ షాను తన దీటైన వాదనతో నిలదీసినంత పని చేశారు. దీంతో ఓ దశలో అమిత్ షా ఇరుకున పడినట్లయింది.

తన అజెండాకే కట్టుబడ్డ అమిత్ షా
ఆరు దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పాల్గొన్న ఈ భేటీలో అమిత్ షా తన అజెండాకే కట్టుబడ్డారు. పేరుకు జోనల్ కౌన్సిల్ భేటీ అయినా కేంద్రం నుంచి తాను తీసుకొచ్చిన అజెండాలో అంశాలపైనే అమిత్ షా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా డ్రగ్స్ కట్టడి, ఫోక్సో నేరాల అదుపు, ఐపీసీ, సీఆర్పీసీ సాక్ష్యాధార చట్టాల సవరణ, రాష్ట్రానికో ఫోరెన్సిక్ కాలేజ్, కోవిడ్ సమస్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాలకే ఆయన కట్టుబడ్డారు. దీంతో ఏపీ, తెలంగాణ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు ఎటో వెళ్లిపోయాయి. ముఖ్యంగా పుదుచ్చేరిలో తమకు భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి రంగస్వామి కేంద్ర పాలిత ప్రాంతం నుంచి రాష్ట్రంగా మార్చాలంటూ చేసిన డిమాండ్ పైనా అమిత్ షా మౌనంగానే ఉండిపోయారు.

తెలుగు రాష్ట్రాలకు నిరాశ
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతి ముఖ్యమైనవి విభజన హామీలు. వాటిని నెరవేర్చకుండా ఇప్పటికే ఏడేళ్లు కాలం గడిపేసిన కేంద్రం.. ఇప్పటికీ వాటిపై నిర్దిష్ట హామీలు ఇవ్వడంలో విఫలమైంది. ముఖ్యంగా సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో విభజన హామీలపై ఏవో కొన్ని అయినా హామీలు లభిస్తాయని ఆశించిన తెలుగు రాష్ట్రాలకు నిరాశ తప్పలేదు. హోంమంత్రి అమిత్ షా గతంలో ఢిల్లీ వచ్చి వెళ్లినప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలకు చెప్పిన అంశాల్నే తిరిగి ఇక్కడ కూడా ప్రస్తావించి భేటీని ముగించేశారు.. దీంతో సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ వల్ల తమకు ఒరిగిందేంటో తెలియక తెలుగు రాష్ట్రాలు నిరాశగా వెనుదిరిగిన పరిస్ధితి కనిపించింది.

జగన్ కు దక్కిన ఊరట ఇదే
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో అందరి కంటే భారీ అజెండాతో వచ్చిన ఆతిధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇందులో ప్రత్యేక హోదాతో పాటు పలు విభజన హామీలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న జల వివాదాలు, డిస్కం నష్టాలు, పోలవరంవంటి ఎన్నో అంశాల్ని ప్రస్తావించారు. వీటిపై నిర్దిష్ట హామీలు లభిస్తాయని ఆశించారు. కానీ అవేవీ జరగలేదు. అయితే జగన్ లేవనెత్తిన హోదా హామీతో పాటు మరికొన్ని అంశాలకు మాత్రం పరిశీలిస్తానంటూ అమిత్ షా చెప్పడం మాత్రమే ఊరటనిచ్చింది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో జగన్ కు హామీ ఇచ్చి ఆ తర్వాత యథావిధిగా తమ పని తాము చేసుకుపోతున్న అమిత్ షా.. ఈసారైనా జగన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారేమో చూడాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com