దుబాయ్ ను ఉర్రూతలూగించిన ‘వేవ్’

- June 07, 2015 , by Maagulf
దుబాయ్ ను ఉర్రూతలూగించిన ‘వేవ్’

 

దుబాయి లో తెలుగు వారి ఆత్మీయ వారధి వేవ్ 8 వ వార్షికోత్సవ సంబరాలు ఇక్కడి స్థానిక రషీద్ ఆడిటోరియంలో జూన్ 5 న వైభవంగా జరిగాయి. సహజ నటి శ్రీమతి జయసుధ , అలనాటి అందాల తార రజని మరియు యువ కధా నాయకుడు శ్రీ నారా రోహిత్ పాల్గొన్నారు. ముందుగా రోహన్ సాయి గణపతి స్తోత్రం తో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు యాంకర్ శ్రీవాణి వ్యాఖ్యాత గా వ్యవహరించారు. వేవ్ కార్య వర్గ సభ్యులు అంతా కలిసి శ్రీమతి జయసుధ ని వేదికపైకి తోడ్కొని రాగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలని ప్రారంభించారు. ప్రముఖ శాస్త్రీయ నాట్య కళా కారుడు శ్రీ మాధవపెద్ది మూర్తి గారి నృత్య రూపకాలు ఆహుతులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. జగదానంద కారక , దశావతారం రూపకాలని అభినయిస్తున్నపుడు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. కేవలం స్థానికంగా ఇక్కడ చదువుకుంటున్న విధ్యార్దులతోనే ఈ నృత్యాలన్ని అభినయించటం విశేషం. వై ఓన్లీ స్విమ్ వెన్ యు కెన్ డాన్స్ అంటూ కొరియో గ్రాఫర్ జాలీ రూపొందించిన చేపల నృత్య రూపకాన్ని చిన్నారులంతా చేపల వేషాల్లో అభినయించటం ఆకట్టుకుంది. సుధీక్షణ చేసిన అరబిక్ నృత్యం, విశాఖ వర్మ రూపొందించిన ఫాన్ డాన్స్ ఆహుతుల్ని అలరించాయి. కుశిత్, కుష్మత్, శివ పాటలు నృత్యాలతో సభికుల కరతాళ ధ్వనుల్ని అందుకున్నారు. అన్నమయ్య పాటతో రూపొందించిన బాలే ఈ కార్యక్రమంలో మరో ముఖ్య ఆకర్షణ. నారా రోహిత్ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల్లో తన సినిమా విడుదల రోజున ఇండియా లో లేకపోవటం ఇదే మొదటిసారి అన్నారు.( ఈరోజు అసుర సినిమా రిలీజ్) అయినా ఇంతమంది తెలుగువారి ఆత్మీయత ముందు ఆ లోటు తెలియటం లేదని చెప్పారు. రౌడి ఫెలో లో ఓ గీతానికి పార్తిసిపెంట్స్ తో కలిసి కాలు కదిపారు. ప్రేక్షకులంతా అసుర సినిమా డైలాగ్ చెప్పమని కోరటంతో అనర్గళంగా ఓ డైలాగ్ చెప్పటంతో ప్రేక్షకులంతా విజిల్స్ వేశారు. మహిత దువూరి , మంజుల తదితరులు ప్రదర్శించిన లంబాడ నృత్యం , పలు సినిమా గీతాలకి చిన్నారులు , పెద్దలు అభినయించిన నృత్యాలు ఆహుతులని అలరించాయి. చాలావరకు ఈ కార్యక్రమాలని రూపొందించిన వేవ్ సంస్థ నిర్వాహకులు శ్రీమతి గీత గారికి కళాకారులు , చిన్నరులంతా తమ ధన్యవాదాలు తెలిపారు. సాయంత్రం 6 గంటలకి ప్రారంభమైన ఈ కార్యక్రమం 11 గంటలవరకు కొనసాగింది. వచ్చిన ప్రేక్షకులంతా చివరివరకు ఉండి అన్ని కార్యక్రమాలని వీక్షించి తమ అభినందలని తెలియచేయటం విశేషం. గత 8 సంవత్సరాలుగా తెలుగు కార్యక్రమాలని దుబాయ్ లో నిర్వహిస్తూ , ఇక్కడి తెలుగు వారికి మన సంస్కృతీ సాంప్రదాయాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా చేరువ చేస్తున్న వేవ్ సంస్థ ని అలాగే సంస్థ నిర్వహిస్తున్న శ్రీమతి గీత , శ్రీ రావెళ్ళ రమేష్ బాబు గారిని అలాగే వేవ్ సంస్థలో భాగస్వాములైన ప్రతి మెంబర్ కి జయసుధ తన శుభాకాంక్షలు తెలియ చేసారు. శ్రీమతి రజని మాట్లాడుతూ దుబాయ్ లో ఇంతమంది తెలుగువారి మధ్య గడపటం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్యకి అధ్యక్షుడుగా ఆఫ్రికా , మధ్య ప్రాచ్య దేశాలకి ఎన్నికైన రావెళ్ళ రమేష్ బాబు గారికి అంతా తమ అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమ కమిటీ సభ్యులుగా శ్రీమతి ఉమా పద్మనాభన్ , సునీత , సుధ, త్రివేణి , విశాల , లావణ్య , ప్రశాంతి , మధు శ్రీనివాస్ , ప్రసన్న , స్వాప్నిక, దివ్య , మోనిష వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్తులో వేవ్ సంస్థ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని , అంతర్జాతీయ తెలుగు సమాజంలో తన ఉనికిని ప్రత్యేకంగా చాటుకోవాలని హాజరైన అతిధులు , ప్రేక్షకులు తమ శుభాకాంక్షలు తెలియ చేసారు. 

--సి.శ్రీ(దుబాయ్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com