కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆందోళన!

- November 29, 2021 , by Maagulf
కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆందోళన!

ఇటీవల, దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా కనుగొన్న కోవిడ్‌ - 19 సంక్రమణ యొక్క కొత్త వేరియంట్‌ గురించి మీడియాలో వార్తలతో నిండి పోతున్నది. మొదటి కేసు 9 నవంబర్‌ 2021న నిర్ధారణ అయింది. ఈ రూపాంతరాన్ని మొదట బి.1.1.529గా నామకరణం చేసారు, ఇప్పుడు దీనిని ఒమిక్రాన్‌ (గ్రీకు వర్ణమాల) అని పిలుస్తున్నారు. బోట్స్‌వానా, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌ మరియు యూకెలతో సహా అనేక ఇతర దేశాలలో కూడా ఈ రూపాంతరం కనుగొనబడింది.

కోవిడ్‌ కొత్త వేరియంట్‌లో తేడా ఏమిటి?

ఇది మొత్తం 50 కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలను కలిగి ఉంది, వైరస్‌ యొక్క స్పైక్‌ ప్రోటీన్‌ భాగంలో 32 ఉత్పరివర్తనలు గుర్తించబడ్డాయి (మానవ కణాలలోకి వైరస్‌ ప్రవేశానికి స్పైక్‌ ప్రోటీన్‌ బాధ్యత వహిస్తుంది). ఇది వాటిని మరింత అంటువ్యాధిగా చేస్తుంది మరియు ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారి నుండి సోకని వారికి మరింత వేగంగా వ్యాపిస్తుంది. దక్షిణాఫ్రికాలో గత రెండు వారాల్లో కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ కొత్త కేసులు ఈ కొత్త వేరియంట్‌ ఆవిర్భావంతో సమానంగా 4 రెట్లు పెరిగాయి.

కొత్త వేరియంట్‌ గురించి డబ్ల్యుహెచ్‌ఒ అంచనా ఏమిటి?

కొత్త వేరియంట్‌ గురించి చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్‌ 26న నిపుణుల సమావేశాన్ని నిర్వహించింది. డబ్ల్యుహెచ్‌ఒ  కొత్త వేరియంట్‌ను ‘‘ఆందోళనకర వేరియంట్‌’’గా పేర్కొంది. దీని అర్థం ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎక్కువ వ్యాప్తి ప్రమాదంతో ముడిపడి ఉంది. ప్రస్తుత రోగ నిర్ధారణలు, టీకాలు మరియు చికిత్సలు ఈ రూపాంతరంపై తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చని కూడా దీని అర్థం. ఆందోళన కలిగించే ఇతర రకాలు ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టాలు.  డెల్టా వేరియంట్‌ భారతదేశంలో (అక్టోబర్‌ 2020) మొదటిసారిగా గుర్తించబడిరది మరియు ఈ సంవత్సరం ప్రారంభంలో రెండవ వేవ్‌ కోవిడ్‌ 19 ఇన్ఫెక్షన్లకు కారణమైంది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల కలిగే లక్షణాలు భిన్నంగా ఉన్నాయా?

దక్షిణాఫ్రికాలోని ఆరోగ్య అధికారులు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ఎటువంటి అసాధారణ లక్షణాలు ఉన్నట్లు నివేదించలేదు. అంటే ఈ వేరియంట్‌ వల్ల వచ్చే లక్షణాలు మునుపటి కోవిడ్‌ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ మాదిరిగానే ఉంటాయి. అదనంగా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇన్ఫెక్షన్‌ యొక్క కొన్ని కేసులు లక్షణాలు లేకుండా ఉంటాయి (సాధారణ కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ లాగానే).

మామూలుగా చేసే ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్షలు కొత్త వేరియంట్‌ ఇన్ఫెక్షన్‌ని గుర్తించగలవా?

దక్షిణాఫ్రికా నుండి ప్రస్తుత డేటా ప్రకారం, ఓమిక్రాన్‌ వేరియంట్‌ ఎస్‌ జన్యువులో తొలగింపు ఉంది, ఇది దాని యొక్క వేగవంతమైన గుర్తింపును నిర్దారిస్తున్నది. కొత్త వేరియంట్‌ను పరీక్షించేటప్పుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆర్‌టి`పిసిఆర్‌ కిట్‌ల యొక్క సున్నితత్వం ప్రభావితం కాకుండా ఉంటుందని సూచిస్తున్నది.

మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

1. దక్షిణాఫ్రికా మరియు కొత్త వేరియంట్‌ కేసులను నివేదించిన ఇతర దేశాలకు పర్యాటక ప్రయాణాలు చేయవద్దు.

2. ప్రభావిత దేశాల నుండి వచ్చే వ్యక్తులను ఖచ్చితంగా పరీక్షించండి మరియు వారిని 10-14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచండి.

3. అర్హులైన వ్యక్తులకు టీకాలు వేయడం మనకు అత్యంత ప్రాధాన్యతగా ఉండాలి. అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు బూస్టర్‌ డోస్‌ (వ్యాక్సిన్‌ యొక్క మూడవ డోస్‌) ఇవ్వాలి (భారత ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ కోసం మార్గదర్శకాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలి).

4. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం, పెద్దగా గుమిగూడడం నివారించడం, సామాజిక దూరం పాటించడం మరియు చేతులను శుభ్రపరచడం వంటి - కోవిడ్‌ నిబంధనలు కొనసాగించాలి.

--డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌(సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌),

    అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com