ఎనిమిది ఆకారంలో నడిస్తే ఎన్నో లాభాలు...

- December 19, 2021 , by Maagulf
ఎనిమిది ఆకారంలో నడిస్తే ఎన్నో లాభాలు...

రోజుకు 10-15 నిమిషాలు నడవడం వల్ల ఆరోగ్యం బావుంటుంది. అదే ఎండలో నడిస్తే శరీరానికి కావలసిన విటమిన్ డి కూడా అందుతుంది. సూర్యకిరణాలు మన చర్మాన్ని తాకి చర్మ సమస్యలు కూడా నివారించబడతాయి. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు.

కానీ అంత టైమ్ లేదు, వాక్ చేయడానికి ప్లేస్ కూడా లేదంటే 8 ఆకారంలో ఇంట్లోనో, మీకు వీలైన ప్రదేశంలో నడవండి. ఈ విధంగా నడవడాన్ని ఇన్ఫినిటీ నడక అంటారు.1980లలో డాక్టర్ డెబోరా సన్‌బెక్ దీనిని రూపొందించారు. ఈ నడకను మన యోగులు కూడా పూర్వకాలంలో ఆచరించారు.

ఇన్ఫినిటీ వాక్ అనేది టూ వీలర్ లైసెన్సు పొందడానికి వెళ్లినప్పుడు టెస్ట్ డ్రైవ్‌లో నడిపిస్తారు. అటువంటిదే 8 ఆకారంలో నడవడం. ఎక్కువ దూరం నడవడానికి తగినంత సమయం లేని వారు లేదా వృద్ధులు దీన్ని చాలా సులభంగా చేయవచ్చు. పిల్లలని కూడా సరదాగా వాక్ చేయమని ప్రోత్సహించవచ్చు. మెరుగైన ఫలితాల కోసం చెప్పులు లేకుండా నడవడం చాలా మంచిది.

ఈ ఇన్ఫినిటీ వాక్ వల్ల కలిగే ప్రయోజనాలు..

సంఖ్య 8 ఆకారంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు ఏకాగ్రత మెరుగు పడుతుంది. చెప్పులు లేకుండా నడవడం వలన అన్ని శరీర భాగాలు ప్రయోజనం పొందుతాయి. కంటి సమస్యలు నివారించబడతాయి. మోకాళ్ల సమస్య, కీళ్లనొప్పులు ఉన్నవారు దీని వల్ల ప్రయోజనం పొందవచ్చు.

ఒక సంవత్సరం పాటు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా తలనొప్పి, జీర్ణ సమస్య, థైరాయిడ్, ఊబకాయం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమమనం లభిస్తుంది. మధుమేహ నియంత్రణలో సహాయపడుతుంది. మనస్సును రిఫ్రెష్ చేస్తుంది రోజంతా అలసట లేకుండా పని చేయడానికి శరీరం, మనసు సహకరిస్తాయి.

ఇన్ఫినిటీ వాక్‌ని ఎలా చేయాలి?

ఒక్కొక్కటి సుమారు 6 అడుగుల వ్యాసం కలిగిన 2 సర్కిల్‌లను కలపడం ద్వారా 8 ఆకారాన్ని గీయాలి. అలా గీయడానికి వీలుపడని సందర్భంలో 8 ఆకారం ఊహించుకుని నడవవచ్చు.

ఈ విధంగా క్లాక్‌వైస్‌లో 15 నిమిషాలు, యాంటీ క్లాక్‌వైస్‌లో 15 నిమిషాలు నడవండి. ఉదయం లేదా సాయంత్రం 5-6 am/pm మధ్య నడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఇంటి ఆవరణలో 10-15 నిమిషాలు నడిస్తే విటమిన్ డి అందుతుంది.

గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఈ ఇన్ఫినిటీ నడకను ప్రారంభించే ముందు మీకు అధిక రక్తపోటు, అధిక మధుమేహం లేదా ఏదైనా ఇతర తీవ్రమైన సమస్యలు ఉన్నట్లయితే, దయచేసి ముందుగా మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. గర్భిణీ స్త్రీలు ఇలా నడవకూడదు. వారు గైనకాలజిస్ట్ సలహాని అనుసరించి ఆ విధంగానే వారి దైనందిన కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com