తెలంగాణలో ఒక్క రోజే 12 ఒమిక్రాన్ కేసులు

- December 19, 2021 , by Maagulf
తెలంగాణలో ఒక్క రోజే 12 ఒమిక్రాన్ కేసులు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ రోజురోజుకి ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న(శనివారం) ఒక్క రోజే 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

బాధితుల్లో నలుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. 12 కేసుల్లో 10 నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. 12 మందిలో 9 మంది విదేశీయులు కాగా.. ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. కెన్యా నుంచి ఆరుగురు, సోమాలియా నుంచి ఇద్దరు, టాంజానియా వాసి ఒకరు విదేశీయులు కాగా.. ఘనా నుంచి ఒకరు, యూఏఈ నుంచి ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.

కొత్తగా నమోదు అయిన కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. మరో ముగ్గురి శాంపిల్స్ జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. రిపోర్ట్స్ రావాల్సి ఉందని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు అవుతుండడంతో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌ కట్టడికి తీసుకోవలసిన ముందస్తు చర్యలను వివరించారు. ఒమిక్రాన్‌పై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నాన్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకుల్లో కేవలం రెండు శాతం మందికి ర్యాండమ్‌గా పరీక్షలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని, ఒక్కడోసు మాత్రమే వేసుకున్నవారిని ఎంపిక చేసి పరీక్షలు చేస్తున్నారు. తక్కువ మందిని పరీక్షిస్తున్నా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక రాష్ట్రంలో శనివారం కొత్తగా 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 78, మేడ్చల్‌లో 15, రంగారెడ్డిలో 14, ఖమ్మంలో 14 కేసులు వచ్చాయి. ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 4,014కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com