'83' మూవీ రివ్యూ

- December 24, 2021 , by Maagulf
\'83\' మూవీ రివ్యూ

నటీనటులు: రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్, పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్ భాసిన్, జీవా, సాకిబ్ సలీం, జతిన్ శర్మ, చిరాగ్ పాటిల్ తదితరులు
దర్శకత్వం: కబీర్ ఖాన్
రచన: కబీర్ ఖాన్, సంజయ్ పూరన్ సింగ్, వాసన్ బాలా
డైలాగ్స్: కబీర్ ఖాన్, వాసన్ బాలా, సుమిత్ అరోరా
నిర్మాతలు: విష్ణు ఇందూరి, దీపిక పదుకోన్, కబీర్ ఖాన్, సాజిద్ నడియావాలా, రిలయెన్స్, ఫాంథమ్ ఫిల్మ్స్, 83 ఫిల్మ్ లిమిటెడ్
సినిమాటోగ్రఫి: అసీమ్ మిశ్రా
ఎడిటింగ్: నితిన్ బేద్
మ్యూజిక్: జూలియస్ పాకియమ్, ప్రతీమ్
రిలీజ్ డేట్: 24-12-2021

ప్రపంచ క్రికెట్‌లో భారత్ పరిస్థితి 80వ దశకం ఆరంభంలో దయనీయమైన పరిస్థితి. భారత జట్టుకు ప్రపంచ కప్ 83లో పాల్గొనేందుకు ఆహ్వానం వస్తే.. మన జట్టు పోటీలో పాల్గొనడం అంత అవసరమా?

అని సొంత క్రికెట్ బోర్డులోనే సెటైర్లు వేస్తారు. 1983కి ముందు ప్రపంచ కప్ పోటీల్లో భారత్‌ జట్టుకు అంత చెత్త రికార్డులు ఉండటమే కారణం. ఈ పోటీల్లో కేవలం ఈస్ట్ ఆఫ్రికా జట్టును ఓడించడం తప్ప.. మరో ఘనత భారత్‌ ఖాతాలో లేదు. 1983 వరకు వస్తే ఈస్ట్ ఇండియా జట్టే కాదు.. ఆ దేశమే ప్రపంచపటంలో లేదు. ఇక ఏ జట్టును భారత్ ఓడిస్తుంది అంటూ జట్టు సభ్యులను అవమానించేలా మాట్లాడుతారు. ఇక ఇంగ్లాండ్‌లో అడుగుపెడితే సరైన గుర్తింపు కూడా లేకపోవడం, అప్పటికే కప్ గెలిచిన వెస్టిండీస్‌కు రాచమర్యాదలు చేయడం లాంటి సంఘటనలు భారత్ పట్ల వివక్ష ఎలా కొనసాగుతుందో అని స్పష్టంగా చెబుతాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ.. మనం గౌరవాన్ని సంపాదించుకోలేకపోయాం అనే డైలాగ్ భారత్ దుస్థితిని సూచించింది. 83 మూవీ ఎలాంటి అనుభూతిని పంచిందంటే..

అవమానాలు, వివక్ష, చిన్నచూపు మధ్య
ప్రపంచ కప్ పోటీల ఆరంభానికి ముందు భారత జట్టు సభ్యులకు సెమీ ఫైనల్‌కు ముందే స్వదేశానికి టికెట్స్ వేస్తారు. ఫైనల్ జరిగే లార్డ్స్ మైదానంలోకి వెళ్లడానికి పాస్‌లు కూడా ఇవ్వరు. అంటే సెమీ ఫైనల్‌కు కూడా చేరనే చులకన భావం, అనేక అవమానాలు, వివక్ష, చిన్నచూపు, గుర్తింపులేని పరిస్థితుల్లో భారత్ జట్టు ఇంగ్లాండ్‌లో తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఇక ప్రపంచకప్‌కు ముందు సునీల్ గవాస్కర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి కపిల్ దేవ్‌కు జట్టు పగ్గాలు అప్పగిస్తారు. ఎలాంటి అనుభవం లేదు.. ఇంగ్లీష్ మాట్లాడటం రాదు.. కపిల్ జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తారా? అనే అనుమానాలు గట్టిగానే తలెత్తుతాయి. మైదానంలో ప్రత్యర్థి జట్లను గడగడ వణికించే వెస్టిండీస్ జట్టుతో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు ఆనవాయితీగా నిర్వహించే ప్రెస్ మీట్‌లో కట్టే.. కొట్టే.. తెచ్చే అనే విధంగా కప్ గెలువడానికి ఇక్కడికి వచ్చాం అని కపిల్ ఛెప్పిన మాటలను బ్రిటీష్ మీడియా, సొంత క్రికెట్ జట్టు నిర్వాహకులు కూడా నవ్వుకుంటారు.
 
బ్రిటీష్ మీడియా కలం దాడి..
అప్పటికే ప్రపంచ కప్‌ను గెలుచుకొన్న వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు ప్రముఖ జర్నలిస్టు తన కాలమ్‌లో.. భారత్ జట్టు మ్యాచ్ గెలిస్తే.. నేను రాసిన ఆర్టికల్‌ను నేను తింటాను అని మితిమీరిన విశ్వాసంతో విర్రవీగుతాడు. ఇలాంటి ఘోరమైన క్షణాల మధ్య భారత్ తన ఆటను మొదలుపెడుతుంది. తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌పై ఘన విజయాన్ని అందుకొన్న భారత జట్టుకు అదృష్టం కొద్ది.. గాలివాటంగా గెలిచిందని బ్రిటీష్ మీడియా సెటైర్లు వేస్తుంది. ఆ తర్వాత జింబాబ్వేతో మ్యాచ్‌లో గెలువడంతో జట్టులో జోష్ పెరుగుతుంది. కానీ ప్రపంచం దృష్టిలో నమ్మకం మాత్రం ఇసుమంతైన కలగదు. ఇలాంటి పరిస్థితుల్లో గవాస్కర్, రోజర్ బిన్నీ జట్టుకు అందుబాటులో లేకపోవడం, వెంగ్ సర్కార్ దవడకు బలంగా గాయం కావడం, జట్టు బౌలింగ్‌కు వెన్నుముకగా మారిన బల్వింధర్ సంధూకు ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ జరగడం లాంటి అంశాలు జట్టు మనోధైర్యంపై దెబ్బ కొట్టినట్టు అవుతాయి. ఇలాంటి లోపాలను అధిగమించి హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నిఖంజ్ జట్టును ఎలా విజయ పథంలోకి నడిపించారనే 83 సినిమా సక్సెస్ స్టోరి.
 
మదర్ సెంటిమెంట్ అంతర్లీనంగా
ఇక కథ, కథనాల విషయానికి వస్తే.. బెస్టాఫ్ లక్ కాదు.. గెలిచి రావాల్సిందే అంటూ కపిల్ దేవ్ తల్లి చెప్పిన మాటలు సినిమాను మరింత ఎమోషనల్‌గా మారుస్తాయి. కపిల్ దేవ్‌ను ఉద్దేశించి ఓ చిన్నపిల్లాడు.. నేను ఫాస్ట్ బౌలర్‌ను.. నీ కోసం మ్యాచ్ చూడటానికి వచ్చాను. మీరు గెలుస్తారా అంటూ ప్రశ్నించం అత్యంత భావోద్వేగంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్టు చేతిలో దారుణమైన ఓటమిని పొందిన తర్వాత ఇతర దేశాల జెండాల నడుమ ఆ చిన్నారి మువ్వెన్నెల భారత జెండాను రెపరెపలాడించడం జట్టు సభ్యుల్లో ఉద్వేగాన్ని, స్పూర్తిని నింపుతుంది.
 
సరిహద్దులో యుద్ద వాతావరణం.. దేశంలో మత కలహాలు
ఇక జింబాబ్వే జట్టుతో మ్యాచ్‌ సందర్బంగా స్కోర్ బోర్డుపై రెండెంకెలు స్కోరు లేకుండా 4 వికెట్లు కోల్పోయి జట్టు దీనావస్థలో ఉన్న పరిస్థితుల్లో కపిల్ దేవ్ ఆడిన ఐకానిక్ ఇన్నింగ్ సినిమాకు హైలెట్‌గా కనిపిస్తుంది. అలాగే మీ నాన్న వయసును మరో పదేళ్లు తగ్గించు అంటూ మొహిందర్ అమరనాథ్‌ను కపిల్ మొటివేట్ చేసే సీన్ సినిమాను మరింత ఆసక్తిగా మారుస్తుంది. ఆటతోపాటు దేశంలోని ఓ ప్రాంతంలో జరిగే మత ఘర్షణలు, అలాగే పాక్, భారత సరిహద్దులో యుద్ద వాతావరణం, బ్రిటన్‌లో భారతీయుల పట్ల వివక్ష లాంటి అంశాలను దర్శకుడు కబీర్ ఖాన్ మేలవించిన తీరు ఓ అద్బుతం. సినిమా కాకుండా వాస్తవ చరిత్రను కళ్ల ముందు జరుగుతున్నట్టు చూపించడంలో దర్శకుడి ప్రతిభ అమోఘం. కథను ఎమోషనల్‌గా, ఓ ఎపిక్‌గా మలచడానికి చేసిన ప్రయత్నం వెనుక ఎవరూ ఊహించని పరిశోధన కనిపిస్తుంది.
 
రణ్‌వీర్ సింగ్ పరకాయ ప్రవేశం
కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పవచ్చు. కపిల్ దేవ్ మాదిరిగా బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు చూస్తే.. తెరపైన రణ్‌వీర్ సింగ్ ఎక్కడా కనిపించడు. కపిల్ దేవ్ నటించాడా అనే అనుమానం కలుగుతుంది. సీసీఐ ట్రైనింగ్ క్యాంపులో తనతో జరిగిన సంఘటనను రోమి (దీపిక పదుకోన్)తో చెబుతూ.. ఫాస్ట్ బౌలర్‌కు రెండు చపాతీలు సరిపోవు. నాలుగు కావాలి అంటే.. ఇండియాలో స్పిన్ మాత్రమే నడుస్తుంది.. ఫాస్ట్ బౌలర్లు అవసరం లేదు అంటూ తారాపూర్ అనే వ్యక్తి చెప్పాడని.. కానీ నాలుగు రోటీలు సాధించి నేను ఇండియాకు ఫాస్ట్ బౌలర్ అయ్యానని చెప్పిన సీన్లు కంటతడి పెట్టిస్తాయి. తెర మీద క్రికెటర్‌గా రూపాంతరం చెందిన తీరులో రణ్‌వీర్ సింగ్ అంకితభావం కనిపిస్తుంది.
 
దీపిక, జీవా, పంకజ్, బోమన్ నటన గురించి
ఇక 83 చిత్రంలో కృష్ణమాచార్య శ్రీకాంత్‌గా జీవా నటించాడు. ఈ సినిమాకు జీవ పాత్ర మంచి ఎంటర్‌టైనర్‌గా మారిందని చెప్పవచ్చు. ఇంగ్లాండ్‌లో కపిల్, మొహిందర్, శ్రీకాంత్‌కు తమిళ కుటుంబం ఆతిథ్యం ఇచ్చిన సీనులోను, అలాగే ఆరంభంలో విజయాలు సాధించిన తర్వాత బ్రిటీష్ జర్నలిస్టుతో జరిగే సంభాషణలో జీవా నటన సూపర్‌గా అనిపిస్తుంది. రోమి కపిల్ దేవ్‌గా దీపిక పదుకోన్ అతిథి పాత్రే అయినప్పటికీ.. ఫైనల్ మ్యాచ్‌ సందర్భంగా పాస్ చింపేసే సీన్‌తోపాటు పలు సన్నివేశాల్లో దీపిక మెరిసింది. లాలా అమరనాథ్‌గా మొహిందర్ అమర్‌నాథ్, మేనేజర్ పీఆర్ మాన్ సింగ్‌గా పంకజ్ త్రిపాఠి, కామెంటర్‌గా క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ పాత్రలో బోమన్ ఇరానీ, కపిల్ తల్లిగా నీనా గుప్తా తదితరులు నటించారు. మిగితా పాత్రల్లో నటించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు ప్రాణం పోశారు.
 
టెక్నికల్ బ్రిల్లియెన్స్
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. అసీమ్ మిశ్రా అందించిన సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. నటీనటులు పెర్ఫార్మెన్స్‌, సన్నివేశాల్లో మూడ్‌ను అసీమ్ అద్బుతంగా ఒడిసిపట్టుకొన్నాడు. క్రికెట్ ఆటను తెర మీద చూపించిన విధానం లైవ్లీగా ఉంది. మ్యూజిక్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ. ప్రీతమ్ అందించిన పాటలు భావోద్వేగాన్ని రగిలిస్తే. జూలియస్ పాకియమ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా మారింది. నితిన్ బేద్ పనితీరు గురించి చెప్పాలంటే.. సినిమా చూస్తే ప్రేక్షకుడికి అర్ధం అవుతుంది.
 
నిర్మాణ విలువలు
83 సినిమాను రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంథమ్ ఫిల్మ్స్, విష్ణు ఇందూరికి చెందిన విబ్రి మీడియా, దీపిక పదుకోన్‌ సొంత బ్యానర్ కా ప్రొడక్షన్, నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మించాయి. తెలుగులో అన్నపూర్ణ స్డూడియో బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను అందించారు. 83 వరల్డ్ కప్‌లో భారత్ సక్సెస్ స్టోరిని తెరకెక్కించాలని ప్రయత్నించిన తెలుగు వాడు విష్ణు ఇందూరిని అభినందించకుండా ఉండలేం. 2013 నుంచి డిసెంబర్ 24, 2021 వరకు సినిమాను ప్రేక్షకుడికి అందించాలనే విష్ణు తపనను మాటల్లో చెప్పలేం.. కొలువలేం.
 
ఫైనల్‌గా
83 మూవీ విషయానికి వస్తే.. భావి తరాలకు 83 చిత్రం ఓ సినిమా కాదు.. కులం, మతం, ప్రాంతాలను ఏకం చేసిన ఓ మధురమైన అనుభూతి, ఓ పాఠం, మనోధైర్యం, స్పూర్తి. ఈ కథ కేవలం సినిమానేకాకుండా ఓ వ్యక్తిత్వ వికాసంగా కూడా కనిపిస్తుంది. హృదయాన్ని తాకే.. మనసును అతలాకుతలం చేసే ఎన్నో విషయాలు 83 మూవీలో ఉన్నాయి. నటీనటులు ఫెర్మార్మెన్స్ కొన్నిసార్లు నవ్విస్తుంది.. మరొకొన్నిసార్లు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా ఓ ఎమోషనల్ రైడ్.. డొంట్ మిస్ ఇట్..

మాగల్ఫ్.కామ్ రేటింగ్: 3.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com