'శ్యామ్ సింగరాయ్' మూవీ రివ్యూ

- December 24, 2021 , by Maagulf
\'శ్యామ్ సింగరాయ్\' మూవీ రివ్యూ

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వచ్చిన గత రెండు సినిమాలు థియేటర్ల వరకు రాకుండానే ఓటీటీలో రిలీజ్ కావడం.. నానీ కెరీర్ లోనే మల్టీలాంగ్వేజెస్ లో శ్యామ్ సింగరాయ్ తెరకెక్కడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు తొలి నుండి శ్యామ్ సింగరాయ్ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ నానీ గత సినిమాలతో పోలిస్తే కొత్తగా ఉండడం.. హీరోయిన్లుగా సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముగ్గురు నటించడం సినిమా మీద మరింత ఆసక్తిని పెంచాయి. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ మూవీలో నాని.. వాసు, శ్యామ్‌ సింగరాయ్‌ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్‌ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ నానీ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..

నటీనటులు: నాని, సాయి పల్లవి, కృత శెట్టి, మడొన్నా సెబాస్టియన్
సినిమాటోగ్రఫీ: సను జాన్ వర్గేసే
సంగీతం: మిక్కీ జే మేయర్
ఎడిటింగ్‌: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
రచన : జంగా సత్యదేవ్
దర్శకత్వం: రాహుల్ సాంకృత్యన్

కథ:
వాసు (నాని) పెద్ద ఫిలిం డైరెక్టర్ కావాలని కలలుకంటూ ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి ముందు తను ఒక షార్ట్ ఫిలిం తీస్తుంటాడు. ఆ షార్ట్ ఫిలింలో నటించేందుకు కీర్తి (కృతిశెట్టి) అనే యువతిని ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఆ షార్ట్ ఫిలిం అందరికీ నచ్చడం.. వెంటనే పెద్ద సినిమా ఆఫర్ రావడం.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో వాసు దశే మారుతుంది. పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. అయితే.. అదే సినిమాను హిందీలోనూ డైరెక్ట్ చేసి కొన్ని లీగల్ సమస్యల్లో చిక్కుకుంటాడు వాసు. ఆ లీగల్ సమస్యలను ఎదుర్కొనే క్రమంలో వాసు దేవ్, శ్యామ్ సింగరాయ్ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయం బయటపడుతుంది. కొన్ని సందర్భాలలో తన గతం గురించి వాసుకు తెలిసివస్తుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ ఎంట్రీ ఉంటుంది. శ్యామ్ సింగ రాయ్ పాత్ర గురించి ప్రేక్షకులకు పరిచయం అయ్యాక సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయి ఇంటర్వెల్ పడుతుంది. సెకండ్ హాఫ్ లో బెంగాల్ లో మొదలైన శ్యామ్ సింగరాయ్ కథ మైత్రి (సాయి పల్లవి)ల ప్రేమ.. దేవదాసి అయిన మైత్రిని ఓ గుళ్లో నాట్యం చేస్తుండడం శ్యామ్ చూసి ప్రేమించడం.. అక్కడ జరిగిన కొన్ని పరిణామాలతో మైత్రితో సహా శ్యామ్ కోల్ కతాకి మారిపోవడం.. అక్కడ విప్లవ రచయితగా సమాజంలో పోరాటం చేస్తూ గొప్పవాడవుతాడు. ఆ తర్వాత వాసుకి.. శ్యామ్ సింగరాయ్ కి మధ్య సంబంధం ఏంటి.. ఇద్దరూ కలుస్తారా.. కీర్తి-వాసుల ప్రేమ సక్సెస్ అవుతుందా అనేది మిగతా కథ.

నటీనటులు:
హీరో నానీకి నటనలో ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. సరదాగా మనలో ఒకడిగా కనిపించే పాత్రలో ఎంత నేచురల్ గా ఒదిగిపోతాడో.. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో అంత చెలరేగిపోతాడు. శ్యామ్ సింగరాయ్ విషయంలో అది మరోసారి నిజమని నమ్ముతారు. నానీ రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలను అవలీలగా చేసుకుపోయాడు.. అద్భుతంగా నటించాడు. వాసుగా సగటు యువకుడిగా కనిపిస్తూనే సమాజాన్ని భిన్నమైన కోణంలో చూస్తూ.. సమాజంలోని జాడ్యాలపై పోరాటం చేసే శ్యామ్ సింగరాయ్ గా బరువైన పాత్రలో అంతే హుందాగా కనిపించాడు. మోడ్రన్ పాత్రలో ఈజీగా నటించేసిన నానీ శ్యామ్ సింగరాయ్ పాత్రలో దుమ్ము దులిపేశాడు. ఇక సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పదేముంది. సాధారణంగానే చాలా ఎనర్జిటిక్ గా నటించే పల్లవికి దేవదాసి లాంటి ప్రత్యేక పాత్రలు పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అసలు సినిమా ముగిసేంత వరకు సాయిపల్లవి ఎక్కడా కనిపించదు.. మైత్రేయిని చూస్తున్నట్లే ఉంటుంది. ప్రణవలయ సాంగ్ లో పడ్డ శ్రమంతా తెరపై మనకు కనిపిస్తుంది. సాయి పల్లవి ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. కృతి శెట్టి అందం అభినయంతో మెప్పించింది.

సాంకేతిక వర్గం:
సినిమా విడుదలకు ముందే యూనిట్ ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో కోల్ కొత వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన కాళికామాత హౌస్ సెట్, విగ్రహం, 1970 నేపథ్యంలో సాగే కోల్ కతా సన్నివేశాల కోసం ఆ నాటి కాలాన్ని తలపిస్తూ వేసిన సెట్ లు కనిపిస్తాయి. సినిమా కథలో కీలక సన్నివేశాల్లో అలనాటి వాతావరణాన్ని గుర్తు చేసే సెట్టింగ్ ల కోసం ఆర్ట్ డిపార్ట్ మెంట్ పడిన శ్రమ తెరపై కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ సను జాన్ వర్గేసేని దర్శకుడు రాహుల్ ఏరికోరి ఎందుకు తీసుకున్నాడో సినిమాలో కీలక సన్నివేశాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం సోసోగా ఉన్నా.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు రాహుల్ కు ఇది రెండో సినిమా అయినప్పటికీ తడబాటు ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రతి ప్రేముకి క్లాసిక్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. కొన్ని సీన్స్ కు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

విశ్లేషణ:
శ్యామ్ సింగరాయ్ సినిమా ఫస్టాఫ్ మొత్తం వాసు పాత్రను హైలెట్ చేస్తే సెకండాఫ్ శ్యామ్ సింగరాయ్ పాత్రను ఎలివేట్ చేస్తుంది. సినిమా టైటిల్ జస్టిఫికేషన్ ప్రకారం చెప్పాలంటే అసలైన సినిమా సెకండాఫ్ నుండే మొదలవుతుంది. అయితే, దర్శకుడు రాహుల్ మాత్రం ఫస్టాఫ్ నానీ శైలిలో సరదాగా సాగిపోతూనే ఓ ప్యాషన్ కోసం కష్టపడుతున్న యువకుడిగా వాసు పాత్రను తీర్చిదిద్ది.. సెకండాఫ్ లో టైటిల్ రేంజిలోనే శ్యామ్ సింగరాయ్ అనే పాత్ర మీద ఫోకస్ చేసి ఎలివేట్ చేశాడు. వాసుకి తన గతం గురించి తెలిసే సన్నివేశాలపై స్పెషల్ ఫోకస్ చేసిన దర్శకుడు రాహుల్.. శ్యామ్ సింగరాయ్ ప్రజల హక్కుల కోసం పోరాటం.. మైత్రితో ప్రేమ సన్నివేశాలు.. విప్లవ రచయితగా మారి గొప్పవాడైన తీరును అద్భుతంగా తెరకెక్కించాడు. రచయిత జంగా సత్యదేవ్ రాసుకున్న కథకు రాహుల్ విజువలైజేషన్ తో ప్రాణం పోశాడు. తాను చెప్పాలనుకున్న కథను ఎక్కడా తడబాటు లేకుండా చెప్తూనే.. ప్రేక్షకులలో ఎక్కడా అసహనం అనేది రాకుండా చూసుకున్నాడు. క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ అయితే.. సినిమాకి ఇదే బెస్ట్ ముగింపు అనేలా అనిపించడంతో సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకుడికి సంతృప్తిగా అనిపిస్తుంది.

మాగల్ఫ్.కామ్ రేటింగ్: 3.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com