హైదరాబాద్ కు 'ఫార్ములా ఈ' కార్ రేసింగ్

- January 17, 2022 , by Maagulf
హైదరాబాద్ కు \'ఫార్ములా ఈ\' కార్ రేసింగ్

హైదరాబాద్: హైదరాబాద్ లో మరో కలికితురాయి చేరనుంది.ప్రతిష్టాత్మక “Formula E” కార్ రేసింగ్ కు మహానగరం అతిత్వరలో ఆతిథ్యమివ్వనుంది.దీంతో ఈ ఘనత సాధించిన ప్రపంచ మహానగరాలు న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్ వంటి ఎలైట్ క్లబ్ లిస్టులో హైదరాబాద్ కూడా చేరింది. ఈమేరకు “ఫార్ములా ఈ” సంస్థకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికీ, గ్రీన్ కో అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగనుంది. అత్యంత పర్యావరణ హితమైన కార్లతో నిర్వహించే ఈ “ఫార్ములా ఈ” రేసింగ్ ను “ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్” అనే సంస్థ ప్రతి ఏడాది ఒక్కో నగరంలో నిర్వహిస్తుంది.

సాంప్రదాయ ఫార్ములా వన్ కార్ రేసింగ్ ల వలే.. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కోసం ప్రత్యేకంగా “రేస్ ట్రాక్” ఏర్పాటు చేయనవసరంలేదు. నగరంలో ఉండే సాధారణ రోడ్లపైనే ఈ ఎలక్ట్రిక్ కార్ రేస్ నిర్వహిస్తారు. నగరంలో రోడ్లు ఎంతో సాఫీగా, నిబంధనల ప్రకారం ఉంటే తప్ప, రేస్ నిర్వాహకులు ఆయా నగరాలను ఎంచుకునేందుకు ఆసక్తి కనబరచరు. అటువంటిది భారత్ లోని న్యూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాలను వెనక్కునెట్టి హైదరాబాద్ ఈ ప్రతిష్టాత్మక రేసింగ్ కు వేదికగా నిలువనుంది. ఇప్పటికే “ఫార్ములా ఈ” సభ్యుడైన.. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, ఈ “ఫార్ములా ఈ”ను భారత్ కు తీసుకువచ్చేందుకు కృషిచేశారు.

ఇటీవల హైదరాబాద్ నగరంలో పర్యటించిన “ఫార్ములా ఈ” బృందం నగరంలోని ట్యాంకుబండ్, నెక్లెస్ రోడ్, KBR పార్క్(చుట్టూ ఉన్న రోడ్డు), జూబిలీహిల్స్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. జనవరి 17న త్రైపాక్షిక ఒప్పందం ఖరారు కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందించే ఈ ప్రాజెక్టులో.. రేస్ నిర్వాహకుల సూచనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా నిర్ణయించిన ప్రాంతాల్లో రోడ్లను విస్తరించి, ఇరువైపులా ప్రేక్షకుల కోసం అక్కడక్కడా స్టాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com