సెమీస్ లో ఏయే జట్లు తలపడతాయన్నది ఆసక్తికరం...

- March 27, 2016 , by Maagulf
సెమీస్ లో ఏయే జట్లు తలపడతాయన్నది ఆసక్తికరం...


వేసవిలో క్రికెట్ అభిమానులకు పరుగుల వినోదాన్ని అందిస్తున్న టి-20 ప్రపంచ కప్ లో లీగ్ పోరు ముగింపు దశకు వచ్చింది. ఇక నాకౌట్ సమరానికి తెర లేవనుంది. సెమీస్ లో ఏయే జట్లు తలపడతాయన్నది ఆసక్తికరంగా మారింది. గ్రూపు-2లో ఓటమెరుగని న్యూజిలాండ్ (8) అగ్రస్థానంతో దర్జాగా సెమీస్ చేరింది. మరో బెర్తు కోసం భారత్ (4), ఆస్ట్రేలియా (4) పోటీపడుతున్నాయి. ఈ రోజు భారత్, ఆసీస్ ల మధ్య జరిగే మ్యాచ్ విజేతకు సెమీస్ బెర్తు ఖరారవుతుంది. ఈ గ్రూపులో దాయాది పాకిస్తాన్ (2)తో పాటు బోణీ కూడా కొట్టని మరో ఉపఖండం జట్టు బంగ్లాదేశ్ (0) ఇంటిదారి పట్టాయి.ఇక గ్రూపు-1 విషయానికొస్తే వెస్టిండీస్ (6), ఇంగ్లండ్ (6) తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్ కు దూసుకెళ్లాయి.దక్షిణాఫ్రికా (2), శ్రీలంక (2), అఫ్ఘానిస్తాన్ (0) టోర్నీ నుంచి నిష్కమించాయి. ఈ గ్రూపులో ఇంకా రెండు లీగ్ మ్యాచ్ లు జరగాల్సివున్నా నామమాత్రమైనవే. తొలి రెండు స్థానాల్లో ఉన్న విండీస్ కు మరో మ్యాచ్ ఉండగా, ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్ లు ఆడేసింది. ఈ రోజు విండీస్, అఫ్ఘాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కరీబియన్ల జోరు చూస్తే అఫ్ఘాన్ పై గెలవడం పెద్ద కష్టమేమీకాదు. ఒకవేళ ఈ మ్యాచ్ లో విండీస్ ఓడినా ఇంగ్లండ్ కంటే మెరుగైన రన్ రేట్ ఉంది కాబట్టి అగ్రస్థానానికి ఢోకా ఉండదు. ఈ గ్రూపులో విండీస్, ఇంగ్లండ్.. తొలి, రెండో స్థానాల్లో నిలవడం దాదాపు ఖాయమే.ఈ సమీకరణాలను గమనిస్తే సెమీస్ లో గ్రూపు-2 టాపర్, గ్రూపు-1లో రెండో స్థానంలో నిలిచిన టీమ్ అంటే కివీస్, ఇంగ్లండ్ ఆడే చాన్స్ ఉంది. మరో సెమీస్ లో గ్రూపు-1 టాప్ టీమ్, గ్రూపు-2లో రెండో స్థానంలో నిలిచిన జట్టు అంటే వెస్డిండీస్, భారత్ లేదా ఆసీస్ తలపడే అవకాశముంది. ఈ రోజు జరిగే కీలక పోరులో భారత్ గెలిస్తే సెమీస్ లో దాదాపుగా విండీస్ ఎదురుకానుంది. నాకౌట్ మ్యాచ్ లు హోరాహోరీగా సాగే అవకాశముంది. కివీస్, విండీస్ సూపర్ ఫామ్ లో ఉన్నాయి. ఈ నెల 30, 31న సెమీస్ మ్యాచ్ లు, వచ్చే నెల 3న ఫైనల్ సమరం జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com