ఉగ్రదాడిపై మాట్లాడిన ఇండియా-యూఏఈ మినిస్టర్లు.. భారతీయుల మృతిపై విచారం

- January 19, 2022 , by Maagulf
ఉగ్రదాడిపై మాట్లాడిన ఇండియా-యూఏఈ మినిస్టర్లు.. భారతీయుల మృతిపై విచారం

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్.. యూఏఈ విదేశాంగ మంత్రి హెచ్‌హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో టెలిఫోన్ లో మాట్లాడారు. యూఏఈపై జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు భారతీయులు చనిపోవడంపై వారు చర్చించారు. దాడికి సంబంధించిన వివరాలను యూఏఈ విదేశాంగ మంత్రి జైశంకర్ తో పంచుకున్నారు. ఇద్దరు భారతీయుల మృతి పట్ల యూఏఈ ప్రభుత్వం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. మృతుల కుటుంబాలకు యూఏఈ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. భారత రాయబార కార్యాలయంతో తమ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా జైశంకర్ తీవ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.  అమాయక పౌరులపై ఇటువంటి దాడి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, నాగరిక సమాజానికి ఇది విరుద్ధంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ విపత్కర పరిస్థితిలో యూఏఈ అధికారులు ఎంబసీకి అందించిన సహాయాన్ని అభినందించారు.

ఉగ్రదాడి జరిగినప్పుడు UAEకి భారతదేశం సంఘీభావాన్ని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. ఈ సమస్యపై అంతర్జాతీయ వేదికలపై భారతదేశం UAEకి అండగా నిలుస్తుందని ప్రకటించింది. మరణించిన వారి మృత దేహాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది. ఎంబసీ కుటుంబాలతో సమన్వయం చేస్తోంది. గాయపడిన వారికి అవసరమైన అన్ని సహాయాన్ని కూడా పర్యవేక్షిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com