మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల కు పుత్ర శోకం

- March 01, 2022 , by Maagulf
మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల కు పుత్ర శోకం

వాషింగ్టన్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్లకు పుత్ర వియోగం సంభవించింది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల కన్నుమూశారు.

ఆయన వయస్సు 26 సంవత్సరాలు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు ఇక లేరని పేర్కొంది. ఇదే విషయాన్ని తమ సంస్థలో పని చేస్తోన్న ఉద్యోగులందరికీ ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.

జైన్ నాదెళ్ల ఆత్మశాంతి కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. సత్య నాదెళ్ల, ఆయన భార్య అనుపమ నాదెళ్ల దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల. కుటుంబంతో కలిసి సత్య నాదెళ్ల అమెరికాలోని సియాటెల్‌లో నివసిస్తోన్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం జైన్ నాదెళ్ల తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. పుట్టుకతోనే ఆయనకు సెలెబ్రల్ పాల్సీ సోకింది. అప్పటి నుంచీ వీల్‌చైర్‌కు పరిమితం అయ్యారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స చేయించినప్పటికీ అది నయం కాలేదు.

సత్య నాదెళ్ల కుమారుడి మరణం పట్ల మైక్రోసాఫ్ట్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేసింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ మేరకు మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఇమెయిల్ చేశారు. 2014లో మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత సత్య నాదెళ్ల- వికలాంగులు, సెలెబ్రెల్ పాల్సీతో బాధపడుతున్న వారికి మరింత అనుకూలంగా ఉండేలా డిజైనింగ్ ప్రొడక్ట్స్‌పైనా దృష్టి సారించారు.

తన కుమారుడి తరహాలో బాధపడుతున్న వారికోసం పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్ ఛైర్లను డిజైన్ చేశారు. జైన్ నాదెళ్ల వైద్య చికిత్సను తీసుకున్న ఆసుపత్రి సహకారంతో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. సియాటెల్ చిల్డ్రన్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌తో కలిసి పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్ ఛైర్లను డిజైన్ చేశారు. జైన్ నాదెళ్ల మరణం పట్ల చిల్డ్రన్ ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ స్పెర్రింగ్ సంతాపం తెలిపారు.

జైన్‌ను తాము ఎప్పటికి మరిచిపోలేమని అన్నారు. సంగీతం అంటే ఆయనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తమ వద్ద ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్న సమయంలో మ్యూజిక్‌ను వింటూ ఉండేవారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో పని చేసే ప్రతి డాక్టర్, నర్స్, హెల్త్ వర్కర్‌ ఆయనను ఇష్టపడతారని అన్నారు. మరణ వార్త విన్న తరువాత తమ ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారని అన్నారు. ఈ మేరకు ఆసుపత్రి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు జెఫ్ స్పెర్రింగ్ ఇమెయిల్ పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com