100వ రోజుకు చేరుకున్న ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’!

- March 13, 2022 , by Maagulf
100వ రోజుకు చేరుకున్న ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’!

"ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్" "శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్" "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" "వంశీ ఇంటర్నేషనల్" మరియు "శుభోదయం గ్రూప్స్" సంయుక్త ఆధ్వర్యంలో, అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకల సందర్భంగా 366 రోజులపాటు నిర్వహించబడుతున్న "ఘంటసాల స్వర రాగ మహాయాగం" కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ నేడు 100వ రోజు వేడుకలను ఘనంగా చేసుకుంది.  

"2021 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్నఈ కార్యక్రమంలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, అమెరికా మొదలైన దేశాల నుండి గాయనీగాయకులు పాల్గొని ఘంటసాల వారి గీతాలను ఆలపించారని, ఇదే ఉత్సాహంతో సింగపూర్లో జరగబోయే ముగింపు సభ, "ఘంటసాల శత జయంతి" ఉత్సవాలకు సిద్ధమవుతున్నామని" వంశీ సంస్థల అధ్యక్షులు డా.వంశీ రామరాజు తెలిపారు

100వ రోజు సందర్భంగా ప్రముఖ సినీ కవి భువనచంద్ర, అమెరికా నుండి ఇందుర్తి బాల రెడ్డి నిర్వాహక సంస్థల అధినేతలు డా వంగూరి చిట్టెన్ రాజు, డా వంశీ రామరాజు, సింగపూర్ నుండి కవుటూరు రత్న కుమార్, డా లక్ష్మీ ప్రసాద్, సమన్వయకర్త ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఘంటసాల వారికి 'భారతరత్న' పురస్కారం లభించడం సమంజసమని ప్రముఖులందరూ కలసి అభిప్రాయం వ్యక్తం చేశారు.అతిధుల సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీగాయకులందరకు ఇవ్వబడే ధృవపత్రాలను వంశీ సంస్థ ఆవిష్కరించింది. 

ప్రముఖ గాయకుడు తాతా బాలకామేశ్వర రావు ఘంటసాల వారి చక్కటి వైవిధ్యభరితమైన పాటలను, పద్యాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సభానిర్వహణ గావించగా, శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షించి ఆనందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com