దేశ పురోగతిని దృష్టిలోపెట్టుకుని మహిళాసాధికారతను వేగవంతం చేయాలి: ఉపరాష్ట్రపతి

- March 30, 2022 , by Maagulf
దేశ పురోగతిని దృష్టిలోపెట్టుకుని మహిళాసాధికారతను వేగవంతం చేయాలి: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: మహిళలను విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మరింతగా ప్రోత్సహించి వారికి సరైన సాధికారత కల్పించేదిశగా మరింత జరగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. భారతదేశ జనాభాలో 49శాతంగా ఉన్న మహిళలను దేశ పురోగతిలోనూ క్రియాశీలక భాగస్వాములు చేసేందుకు చొరవతీసుకోవాలన్నారు.

ఢిల్లీలో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ - ఎఫ్ఎల్ఓ 38వ వార్షిక సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి.. సమాజంలో మహిళల పురోగతికి ప్రతికూలంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ రంగాల్లో లింగ వివక్షత పెను ప్రభావాన్ని చూపిస్తోందని.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతోపాటు పౌరసమాజం ప్రత్యేకమైన చొరవ తీసుకుని మహిళాసాధికారతకు బాటలు వేయాలని ఆయన సూచించారు.
పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న తీరును ప్రత్యేకంగా అభిమానించిన ఉపరాష్ట్రపతి ఈ సంఖ్య మరింతగా పెరగాలని, శాసన వ్యవస్థలోనూ మహిళల భాగస్వామ్యానికి సరైన అవకాశం ఇవ్వాలని సూచించారు. మహిళా సాధికారత కారణంగా కుటుంబంతోపాటు తోటి సమాజంపైనా సానుకూలమైన ప్రభావం కనబడుతుందని.. తమకు అవకాశం ఇచ్చిన చోట్లో శక్తిసామర్థ్యాలను మహిళలు చాటిచెప్పిన సందర్భాలెన్నో ఉన్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు. లింగక వివక్షతను రూపుమాపడంతోపాటు బాలికల విద్యను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని విస్మరించకూడదన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సంస్థలు తమవంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల వరకు సమర్థవంతంగా తీసుకెళ్లడంలో చొరవతీసుకోవాలన్నారు. 

మహిళలకు విద్యనందించడం ద్వారా శిశు, మాతృమరణాలు తగ్గడంతోపాటు ఎన్నో ప్రయోజనాలను భారతీయ సమాజం అనుభవపూర్వకంగా తెలుసుకుందన్నారు. విద్య ద్వారా కలిగే సాధికారతతో మహిళలు నిర్ణయాత్మక స్థాయికి ఎదుగుతారన్నారు.
వ్యాపారంలో మహిళల భాగస్వామ్యం ఇటీవలి కాలంలో పెరుగతున్న విషయం దేశ పురోగతికి ఎంతో సానుకూల పరిణామమన్న ఉపరాష్ట్రపతి.. దేశ జనాభాలో 49శాతంగా ఉన్న మహిళలు, 60శాతంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, దాదాపు 65శాతంగా ఉన్న యువత (35 ఏళ్ల లోపు).. వీరికి సరైన అవకాశాలు కల్పించినపుడే సమగ్రపురోగతి సాధ్యమవుతుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఎఫ్ఎల్ఓ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాల్లో విస్తృతంగా పాల్గొంటున్నానన్న ఆయన.. ఆ కార్యక్రమాల్లో బంగారుపతకాలు పొందుతున్న వారిలో 65 శాతానికి పైగా యువతులే ఉండటం భవిష్యత్ భారతాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ అధ్యక్షురాలు ఉజ్వల సింఘానియా, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు ఉమ చిగురుపాటి, నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు దాల్మియా,ఢిల్లీతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మహిళాపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com