కరోనా అలర్ట్‌.. ముఖ్యమంత్రులతో మోడీ స‌మావేశం

- April 27, 2022 , by Maagulf
కరోనా అలర్ట్‌.. ముఖ్యమంత్రులతో మోడీ స‌మావేశం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల ఆదేశాలను జారీ చేస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచిస్తున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు అవసరం అని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తుగా అప్రమత్తమవుతోంది. దేశంలో కోవిడ్‌ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించనున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కరోనా బెల్స్‌ను మోగించింది. ఈ క్రమంలో అన్ని దేశాలూ అప్రమత్తం అవుతున్నాయి. దేశంలోని కరోనా పరిస్థితులపై నేడు మోడీ చర్చించనున్నారు. ఈసందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలవారీగా కోవిడ్‌ వ్యాప్తి తీరుతెన్నులపై ఒక ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక దేశంలో మంగళవారం మరో 2,483 కొత్త కోవిడ్‌ కేసులు నమోదవగా, 52 మరణాలు సంభవించాయి. కొత్త కేసుల్లో సగం ఢిల్లీలోనే బయటపడుతున్నాయి.
 
ఇదిలా ఉండగా.. చైనాలోని షాంఘైలో గత 24 గంటల్లో మరో 52 మంది కరోనాతో చనిపోయారు. దీంతో గత 10 రోజుల్లో అక్కడ సంభవించిన కోవిడ్‌ మరణాల సంఖ్య 190కి పెరిగింది. ఈనేపథ్యంలో రాజధాని బీజింగ్‌లో సోమవారం 35 లక్షల మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా 32 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో నగరంలోని మిగతా 2.1 కోట్ల జనాభాకు కూడా పరీక్షలు నిర్వహించాలని చైనా సర్కారు ఆదేశాలు జారీచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com