దుబాయ్ విమానాశ్రయానికి చేరిన భారత ఆభరణాల కంటైనర్

- May 04, 2022 , by Maagulf
దుబాయ్ విమానాశ్రయానికి చేరిన భారత ఆభరణాల కంటైనర్

దుబాయ్: చారిత్రాత్మకమైన భారతదేశం-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)లో భాగంగా భారత్ నుంచి బయలుదేరిన ఆభరణాల ఉత్పత్తులతో కూడిన కంటైనర్ దుబాయ్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఫ్రీ జోన్‌లోని ట్రాన్స్ గార్డ్ హెడ్‌క్వార్టర్స్ లో ఓ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించారు. ఇందులో యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, యూఏఈలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మిస్టర్ జుమా మహ్మద్ అల్ కైత్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ డైరెక్టర్ మిస్టర్ సౌద్ అల్ అక్రూబీలు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్, సిరోయా జ్యువెలర్స్, జ్యువెల్ వన్ జ్యువెలరీ  అనే ఆభరణాల దిగుమతిదారులకు సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, డీఎంసీసీ  అండ్  ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ ఆఫ్ యూఏఈ,  ఎంబసీ ఆఫ్ ఇండియా & కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, వాణిజ్య ప్రతినిధులు, జీజేఈపీసీ సభ్యులు, ట్రాన్స్ గార్డ్, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. CEPA కింద భారతదేశం నుండి యూఏఈకి ఆభరణాల ఉత్పత్తులతో కూడిన కంటైనర్ ను మే 1న ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం న్యూఢిల్లీ నుండి ఫ్లాగ్ ఆఫ్ చేసిన విషయం తెలిసిందే. భారతదేశం-యూఏఈ మధ్య USD 60 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కలిగి ఉన్నాయి. భారతదేశం యూఏఈ కి 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, అతిపెద్ద ఎగుమతి దారుగా ఉంది. అలాగే యూఏఈ కూడా  భారతదేశానికి 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, 2వ అతిపెద్ద ఎగుమతి దారుగా ఉన్నది. రెండు దేశాల మధ్య ఈ రాయితీ/స్వేచ్ఛా వాణిజ్యం ఏర్పాటు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com