పోలీసు బలగాల సంస్కరణల అమలులో నూతనోత్తేజానికి ఉపరాష్ట్రపతి పిలుపు
- May 09, 2022
న్యూఢిల్లీ: ప్రగతిశీల, ఆధునిక భారతదేశంలో ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు బలగాలు సంసిద్ధం కావాలని, ఇందుకోసం పోలీసు బలగాల సంస్కరణల అమలులో నూతనోత్తేజానికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మాజీ పోలీస్ అధికారి ప్రకాష్ సింగ్ రచించిన ‘ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. 21 శతాబ్దపు సైబర్ క్రైమ్ వంటి నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ఈ తరం సవాళ్ళకు అనుగుణంగా పోలీసుల నైపుణ్యాలను మెరుగు పరచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ఖాళీల భర్తీ మొదలుకుని ఆధునిక పోలీసింగ్ అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖలో మౌలిక సదుపాయాల కల్పన సహా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన అంశాలను నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పోలీసుల నివాస సముదాయాలతో సహా ప్రతి అంశంలోనూ ఈ మార్పులు జరగాలని సూచించారు. సామాన్య ప్రజల పట్ల పోలీసుల స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించిన ఉపరాష్ట్రపతి, అనేక మంది పోలీసు అధికారులు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందు కోసం పోలీసుల వైఖరిలో స్పష్టమైన మార్పు రావలసిన అవసరం ఉందన్న ఆయన, ప్రతి ఒక్కరి సమస్యను విని అర్ధం చేసుకునే ఓపికను పోలీసులు కలిగి ఉండాలని పేర్కొన్నారు.
పోలీసు సంస్కరణలు అత్యంత కీలకమైన, సున్నితమైన అంశమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ఈ సంస్కరణల కోసం అనేక సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ సంకల్పం అవసరమని పేర్కొన్నారు. ప్రగతి కోసం శాంతి అత్యంత ఆవశ్యకమన్నఆయన, దేశంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, ఆర్థిక వృద్ధిని నిలబెట్టడానికి పోలీసు సంస్కరణ అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
1857 తర్వాత బ్రిటీష్ పాలకులు తమ సామ్రాజ్య ప్రయోజనాలను నిలబెట్టుకోవడమే ప్రధాన అజెండాగా పోలీసు బలగాలకు రూపకల్పన చేశారన్న ఉపరాష్ట్రపతి, స్వరాజ్య సముపార్జన తర్వాత కూడా ఈ విషయంలో ఆశించిన మేర సంస్కరణలు రాకపోవడం బాధాకరమని, వీలైనంత త్వరగా పోలీసింగ్ లో విస్తృతమైన సంస్కరణలు తీసుకురావాలని సూచించారు.
ఎమర్జెన్సీ సమయంలో మానవ హక్కుల అణచివేత విషయంలో నాటి పాలకులు పోలీసు బలగాలను దుర్వినియోగం చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 1977లో పోలీసు కమిషన్ ఏర్పాటు, సంస్కరణల ప్రతిపాదనలు తదితర అంశాలను ఈ సందర్బంగా ఉటంకించారు. అయితే పోలీసు బలగాల వ్యక్తిగత, సంస్థాగత స్థాయిలో ఈ సంస్కరణల వేగం మరింత పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు.
2006 నాటి పోలీసు సంస్కరణలపై సుప్రీం కోర్టు ఆదేశాల అమలు కార్యరూపం దాల్చకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, పోలీసింగ్ అనేది రాష్ట్రాల పరిధిలో ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృంద స్పూర్తితో ఈ సంస్కరణలను అమలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఖైదీల గుర్తింపు చట్టం 1920 సహా మెరుగైన పోలీసింగ్ కోసం భారత ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, పోలీసులను స్మార్ట్ ఫోర్స్ గా మార్చాలన్న ప్రధానమంత్రి పిలుపును అభినందించారు. నూతన శతాబ్ధపు సవాళ్ళను అధిగమించడంలో స్మార్ట్ ఫోర్స్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడతాయన్న ఆయన, ఈ విషయంలో ఇండియన్ పోలీస్ ఫాండేషన్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
రాజకీయాలు, చట్టసభలు, న్యాయవ్యవస్థ సహా ప్రజా జీవితంలోని అన్ని రంగాల్లో సంస్కరణలకు పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాజకీయ నాయకులు, సివిల్ సర్వెంట్ల మీద ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.ఎన్నికైన ప్రజా ప్రతినిధుల అనైతిక ఫిరాయింపులను కట్టడి చేసేందుకు, ఫిరాయింపుల నిరోధక చట్టంలో సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. పోలీసు సంస్కరణలను సమర్ధించిన పుస్తక రచయిత ప్రకాష్ సింగ్ ను అభినందించిన ఆయన, ఓ మాజీ అధికారి తమ ఒంటరి ప్రయత్నాలతో ఇంత సాధించారన్నారు. భవిష్యత్ లో ప్రజా-స్నేహపూర్వక పోలీసు దళం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఇది చట్టబద్ధమైన పాలనకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.
దేశంలో వివిధ ప్రాంతాల్లో నేరస్తులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అరాచక శక్తులతో పోరాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసుల స్మృతికి ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. పుస్తక రచయిత, బి.ఎస్.ఎఫ్. మాజీ డైరక్టర్ జనరల్ ప్రకాష్ సింగ్, ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కౌశిక్ దేకా, కామన్ కాజ్ డైరక్టర్ విపుల్ ముద్గల్, ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎన్. రామచంద్రన్, రూపా పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ కపీష్ మెహ్రా సహా పలువురు రిటైర్డ్, సీనియర్ పోలీసు అధికారులు, పాత్రికేయులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







