'అంటే సుందరానికీ' మూవీ రివ్యూ

- June 10, 2022 , by Maagulf
\'అంటే సుందరానికీ\' మూవీ రివ్యూ

నటీనటులు: నాని, నజ్రియా ఫహాద్, నరేష్, నదియా, హర్ష వర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.

దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
మ్యూజిక్: వివేక్ సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
నిర్మాణం: మైత్రీ మూవీస్ సంస్థ

మొన్న ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టి, ఫుల్ స్వింగ్ మీదున్న నాని నటించిన చిత్రం  ‘అంటే సుందరానికీ.!’ సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ బాగుంది. సినిమాని ప్రమోట్ చేయడంలో మొదట్నుంచీ నాని అండ్ టీమ్ చూపించిన ఆసక్తి, సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. అయితే, ఆ అంచనాల్ని ‘అంటే సుందరానికి.!’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే ధియేటర్‌కి వెళ్లి సినిమా చూడాల్సిందే. అయితే, ‘అంటే సుందరానికీ.!’ కథా, కమామిషు ఎలా వుందంటే.!

కథ:

సుందర్ ప్రసాద్ (నాని) సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. మరియు కుటుంబానికి ఏకైక వారసుడు. సుందర్ కుటుంబానికి జాతకాల పిచ్చితో పాటు, పద్ధతులూ, సాంప్రదాయాలూ, గుడ్డి నమ్మకాలు చాలా ఎక్కువ. అవన్నీ, సుందర్‌పై రుద్దుతూ టార్చర్ చేస్తుంటారు. ఒకసారి సుందర్ అమెరికా వెళ్లాలనుకుంటాడు. కానీ, ఆయన జాతకంలో దోషం వుందనీ, అమెరికా వెళితే, అనవసర సమస్యలు వస్తాయని ఆయన కుటుంబం అందుకు నిరాకరిస్తుంది. దాంతో చేసేది లేక ఆ ప్రయత్నం విరమించుకుంటాడు సుందర్. ఇంతలో ఫోటోగ్రాఫర్ అయిన లీల (నజ్రియా ఫహాద్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు సుందర్. కట్ చేస్తే, లీలా క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయ్. దాంతో ఇరు కుటుంబాల వాళ్లూ వీరి పెళ్లిని అంగీకరించరు. చివరికి వాళ్ల ప్రేమను దక్కించుకోవడానికి సుందర్, లీలలు ఓ ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటీ.? దాని వల్ల సుందర్, లీలలు ఎదుర్కొన్న సమస్యలేంటీ.? తెలియాలంటే, ‘అంటే సుందరానికీ.!’ సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే:

కామెడీ టైమింగ్‌కి నాని పెట్టింది పేరు. ఫన్నీటోన్‌లో డిజైన్ చేసిన సుందరం పాత్రను చాలా అలవోకగా పోషించేశాడు నాని. నాని గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. తన పాత్రకు హండ్రెడ్ పర్సంట్ న్యాయం చేశాడు. ఫ్యాన్స్ నానిని ఎలా కోరుకుంటారో అలాగే కనిపించి సుందరంగా మెప్పించడంలో నూటికి నూరు మార్కులేయించుకున్నాడు.  తొలి తెలుగు సినిమానే అయినా నజ్రియా ఫహాద్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. క్రిస్టియన్ అమ్మాయిగా తన పాత్రకు నేచురల్ ఫ్లేవర్ అద్దింది. మొదటి సినిమానే అయినా చక్కగా డబ్బింగ్ చెప్పింది. ఆ పాత్రతకు అదే హైలైట్ అయ్యింది. అలాగే, అరుణా భిక్షు,నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, నదియా తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికంగా:
కులాంతర వివాహం అనే సెన్సిటివ్ సబ్జెక్ట్‌ని ఎవరి మనోభావాలూ దెబ్బ తీయకుండా, చాలా చాకచక్యంగా డీల్ చేశాడు వివేక్ ఆత్రేయ. ఈ కాన్సెప్ట్‌లో చాలా సినిమాలు తెరకెక్కాయి. కానీ, ‘అంటే సుందరానికీ.!’లో ఫన్ టోన్‌లో ఈ సబ్జెక్ట్ చెప్పడం సమ్‌థింగ్ డిఫరెంట్. ఆ విషయంలో వివేక్ ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. అలాగే, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. తెలుగుతనాన్ని చక్కగా చూపించాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే, అక్కడక్కడా కాస్త సాగతీతగా అనిపించింది. రవితేజ గిరిజాల తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. వివేక్ సాగర్ మ్యూజిక్ సిట్యువేషనల్‌గా ఓకే అనిపించింది.

ప్లస్ పాయింట్స్:
నాని కామెడీ టైమింగ్, నజ్రియా నటన
ఆకట్టుకునే డైలాగులు
క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూనే కామెడీ పండించడం

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ సాగతీత
తేలిపోయిన క్లైమాక్స్

విశ్లేషణ:
ఫస్టాఫ్ అంతా కామెడీగా నడుస్తుంది. అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్లు బాగానే పండుతాయ్. కానీ, ఎక్కడా కామోడీ టోన్ డ్రాప్ అవ్వకుండా చూసుకున్నాడు డైరెక్టర్. ఇంటర్వెల్ బాంగ్‌‌ని ఆసక్తిగా ప్లాన్ చేశాడు. సెన్సిటివ్ సబ్జెక్ట్‌కి ఓ సామాజిక సందేశాన్ని జోడించి హ్యాండిల్ చేసిన విధానం అందర్నీ కన్విన్స్ చేసేలాగే వుంది. కానీ, నిడివి విషయంలో ఇంకాస్త ఆలోచించి వుంటే బాగుండేది. అనవసరమైన సాగతీతలా అనిపించే సన్నివేశాలు కొన్నిబలవంతంగా చొప్పించేశారు. అలాగే, హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ అప్పీల్‌కి స్పేస్ వున్నా, ఎందుకో అవైడ్ చేసినట్లనిపించింది. క్లైమాక్స్‌ని ఇంకాస్త బలంగా రాసుకుని వుంటే బాగుండేది.

చివరిగా:
 ‘అంటే సుందరానికీ.!’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నో డౌట్.!  అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించడం పక్కా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com