పాకిస్తాన్‌కు ముషారఫ్.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ..మరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

- June 15, 2022 , by Maagulf
పాకిస్తాన్‌కు ముషారఫ్.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ..మరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

దుబాయ్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను పాకిస్తాన్ తీసుకురావాలని భావిస్తోంది ఆ దేశ ఆర్మీ. ముషారఫ్ ప్రస్తుతం దుబాయ్‌లో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

కొన్నేళ్లుగా దుబాయ్‌లోనే ఉంటున్న ఆయనను చివరిదశలోనైనా స్వదేశానికి రప్పించాలని ఆ దేశ ఆర్మీ భావిస్తోంది.

ముషారఫ్ ఒకప్పుడు పాక్ సైన్యాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సైన్యం సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1999-2008 వరకు పాక్‌ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ సమయంలో పాలన మొత్తం ఆయన చేతిలోనే ఉండేది. అయితే, ఆయనకు 2019లో పాక్ కోర్టు మరణశిక్ష విధించింది. తర్వాత కోర్టు శిక్షను రద్దు చేసింది. ముషారఫ్‌ను పాక్ తీసుకొచ్చే ఉద్దేశంతో ఆర్మీ అధికారులు ఇప్పటికే ఆయన కుటుంబాన్ని సంప్రదించారు. కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపితే, ఆయనను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని, దేశంలో తగిన చికిత్స అందిస్తామని ఆర్మీ ప్రకటించింది. కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చింది. అయితే, ఈ విషయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతోపాటు, డాక్టర్ల సలహా కూడా అవసరమే.

ముషారఫ్‌పై అనేక నేరారోపణలు ఉన్నప్పటికీ, ఆయన దేశం రావడానికి అనుమతిస్తామని, ఎలాంటి అడ్డంకులూ సృష్టించబోమని పాక్ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన తిరిగి కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2016లో దుబాయ్ వెళ్లిన ఆయన ఇప్పటివరకు తిరిగి పాక్ వెళ్లలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com