మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన మహనీయుడు సినారె: ఉపరాష్ట్రపతి
- July 29, 2022
హైదరాబాద్: యావత్ తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తుంచుకునే మహాకవి, తెలుగు కీర్తి, సాహితీ మూర్తి డాక్టర్ సి.నారాయణ రెడ్డి అని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.మాతృభాషను తాను ప్రేమిస్తూ తన రచనల్లో ఈ అభిమానాన్ని ప్రతిబింబించడంతోపాటుగా సమాజంలో మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన మహనీయుడు సినారె అని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ ఒడియా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్ కు ఉపరాష్ట్రపతి ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినారె కవిత్వం, సాహిత్యం ఎప్పుడూ మానవ జీవనం, తత్వం, ప్రకృతిని ప్రేమించడం తదితర అంశాల చుట్టూనే సాగాయన్నారు. వారికి జ్ఞానపీఠ్ అవార్డును తెచ్చిపెట్టిన ‘విశ్వంభర’, మానవుడికి, ప్రకృతికి ఉన్న సంబంధాన్ని మానవీయ భావనతో తెలిపే ఆలోచనాత్మక కావ్యమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇది ఆయన్ను రసోద్విగ్నుడిగా, శిల్ప భరతుడిగా విశ్వసాహితీ పీఠం పై నిలబెట్టిందన్నారు.
రాజసం, ఠీవీ, గాంభీర్యం, లాలిత్యం, మాధుర్యం, శృంగారాల మేళవింపుగా సినారె రచనలు సాగాయన్న ఉపరాష్ట్రపతి, వారి రచనలు పాత తరానికి, కొత్త తరానికి వారధులు వేశాయని పేర్కొన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, సినిమా సాహిత్యానికి సైతం గౌరవాన్ని సంపాదించిపెట్టిన సినారె చిరస్మరణీయులని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా, ప్రభుత్వ భాషా సంస్కృతుల సలహాదారుగా, సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన తన ప్రతి పదవికీ వన్నెతీసుకొచ్చారన్నారు.
“ఋషిత్వానికి - పశుత్వానికీ.... సంస్కృతికీ – దుష్కృతికీ, స్వచ్ఛందతకూ – నిర్బంధతకూ - సమార్ధ్రతకూ – రౌద్రతకూ తొలిబీజం మనసు, తులారూపం మనసు, మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి ఇదే విశ్వంభరాతత్త్వం ఇదే అనంత జీవిత సత్యం” అన్న విశ్వంభర కవితా పంక్తుల్ని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. దేనికైనా ముందుగా మనసు సిద్ధం చేసుకోవాలన్న సినారె వారి విశ్వంభర కవితా పంక్తులు, తన జీవనాన్ని ప్రతిబింబించాయన్న ఆయన, అందులోని కిటుకును తెలుసుకోగలిగితే ఎవరైనా, దేన్నైనా ఆనందంగా స్వీకరించగలరని పేర్కొన్నారు.
కవితలు, సాహిత్యం, సినీగీతాల్లో తెలుగు భాషకు సినారె పెద్దపీట వేశారన్న ఉపరాష్ట్రపతి, తెలుగుదనానికి ఆయన నిలువెత్తు సంతకమని తెలిపారు. వారి ఆహార్యంతోపాటు మనసు కూడా ఎప్పుడూ మాతృభాష గురించి తపన పడుతూనే ఉండేదన్నారు.నారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యులుగా ప్రతిపాదించిన బిల్లులలో ప్రధానమైంది ‘మాతృభాష’ (నిర్బంధ బోధన – అధ్యయనం) బిల్లు అని గుర్తుచేశారు. విద్యార్థి చదివే భాషల్లో మాతృభాష తప్పక ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయాలని, భారత రాజ్యాంగం ‘8’వ షెడ్యూలులో పేర్కొన్న భాషలకు, దీనిని వర్తింపజేయాలని, నారాయణరెడ్డిగారు పట్టుబట్టిన విషయాన్నీ ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020) మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యత నారాయణరెడ్డి ఆకాంక్షించినదేనన్నారు.ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఇలాంటి విశిష్ట వ్యక్తిత్వమైన నారాయణ రెడ్డి కవితలు, సాహిత్యం, వారి జీవన విధానాన్ని, మాతృభాష పట్ల వారి అంకితభావాన్ని యువత అవగతం చేసుకోవాలన్నారు.
సినారె జయంతి సందర్భంగా, వారి పేరిట ఏర్పాటు చేసిన డా. సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి,సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సభ్యులకు, సి.నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు.పురస్కార గ్రహీత డాక్టర్ ప్రతిభా రాయ్ కు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు.మాతృభాషను అమితంగా ప్రేమించి తెలుగు సాహిత్యంలో జ్ఞాన్ పీఠ్ పురస్కారం పొందిన సి.నారాయణరెడ్డి పేరిట ఏర్పాటు చేసిన అవార్డును తన మాతృభాష అయిన ఒడియాను ప్రేమి మరో జ్ఞాన్ పీఠ్ పురస్కార గ్రహీత కు ఇవ్వడం అభినందించదగిన అంశమని ఆయన అన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో దీపికా రెడ్డి బృందంచే మన మాతృభాష తెలుగు, అష్టవిధ శృంగార నాయికలు రూపకాలు ప్రేక్షకులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ కార్యదర్శి జె.చెన్నయ్య కి, అవార్డు గ్రహీత డా.ప్రతిభా రాయ్, ప్రముఖ రచయిత్రి ఓల్గా సహా సినారె కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..