అల్‌ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీని మట్టుబెట్టిన అమెరికా బలగాలు

- August 02, 2022 , by Maagulf
అల్‌ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీని మట్టుబెట్టిన అమెరికా బలగాలు

అమెరికా: ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అయ్‌మన్ అల్‌జవహరి హతమయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా పకడ్బందీ ప్రణాళికతో జరిపిన డ్రోన్ దాడిలో జవహరి హతమైనట్టు అధికారులు ‘రాయిటర్స్’కు తెలిపారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం జరిపిన డ్రోన్ దాడిలో జవహరి హతమైనట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.

అమెరికా డ్రోన్ దాడిపై తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. డ్రోన్ దాడి జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారిస్తూనే తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహరిని అంతమొందించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న మాట్లాడుతూ.. ‘విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’గా అభివర్ణించారు.

కాగా, 11 సెప్టెంబరు 2001లో అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా జరిపిన దాడిలో దాదాపు 3 వేల మంది మరణించారు. ఈ దాడి సూత్రధారుల్లో అల్ జవహరి కూడా ఒకరని అమెరికా గుర్తించింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత ఉగ్రవాద సంస్థ పగ్గాలను జవహరి అందుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com